అమెరికా చర్యలతో అణు యుద్ధ పరిస్థితులు

అగ్రరాజ్యం అమెరికా ఉద్రిక్తతలు పెరిగేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నదన్న కిమ్‌ జోంగ్‌ ఉన్‌

Advertisement
Update:2024-11-22 11:33 IST

అగ్రరాజ్యం అమెరికా ఉద్రిక్తతలు పెరిగేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నదని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోపించారు. ప్యాంగ్యాంగ్‌లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్‌లో కిమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికాపై పలు విమర్శలు చేసినట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి.

కొరియా ద్వీపకల్పంలో పోరాడుతున్న పార్టీలు ఇప్పటివరకు అణుయుద్ధ ప్రమాదాలను ఎదుర్కోలేదు. అది అత్యంత విధ్వంసకర థర్మో న్యూక్లియర్‌ యుద్ధంగా మారేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేము ఇప్పటికే అమెరికాతో చర్చలు జరపడానికి చాలా దూరం వెళ్లాం. కానీ ఎలాంటి ఫలితం లేదు. మాపై దూకుడు, శత్రుత్వ విధానాన్ని ప్రదర్శించడంతో అమెరికాలో మార్పు లేదని కిమ్‌ పేర్కొన్నారు. మరోవైపు కిమ్‌ తన ప్రసంగంలో ఆయుధాలను మరింత అత్యాధునికంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా- ఉత్తర కొరియా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కీవ్‌తో యుద్ధానికి మద్దతుగా 11 వేల మంది కిమ్‌ సైనికులు రష్యాలో శిక్షణ పొందుతున్నారని ఉక్రెయిన్‌ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. మాస్కోకు ఉత్తర కొరియా సైనికులను పంపడాన్ని అమెరికా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే రష్యా-ఉత్తర కొరియాలు రక్షణ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. శత్రుదేశం నుంచి దాడి జరిగితే ఈ రెండు ఒకదానితో ఒకటి సహకరించుకునేలా ఈ ఒప్పందాలు కుదిరినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. కిమ్‌, పుతిన్‌ మధ్య స్నేహం మరింత బలపడటం పాశ్చాత్య దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. 

Tags:    
Advertisement

Similar News