హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఐటీ హబ్ విస్తరణకు ప్రభుత్వం ప్రణాళిక‌

TSIIC ఇప్పటికే ప్రాజెక్ట్ అమలు కోసం బిడ్డర్ల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఓల్డ్ సిటీతో సహా హైదరాబాద్‌లోని దక్షిణ ప్రాంతాలలో ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement
Update:2023-01-09 12:42 IST

హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు వెస్ట్ జోన్ లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రీకృతమై ఉంది. అయితే దానికి మించి ఇతర ప్రాంతాలకు ఐటి హబ్‌లను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగా పాతబస్తీలో ఐటి సేవలను పెంచడానికి, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి మలక్‌పేటలో ఐటి టవర్‌ను ఏర్పాటు చేయబోతోంది.

మలక్‌పేటలో 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్లతో ఐటీ టవర్‌ను అభివృద్ధి చేయనున్నారు.

ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSIIC)కి అప్పగించారు.

TSIIC ఇప్పటికే ప్రాజెక్ట్ అమలు కోసం బిడ్డర్ల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఓల్డ్ సిటీతో సహా హైదరాబాద్‌లోని దక్షిణ ప్రాంతాలలో ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

TSIIC 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 16 అంతస్తులతో భారీ టవర్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. హైదరాబాద్ గ్రిడ్ పాలసీ ప్రకారం మొత్తం బిల్ట్ అప్ ఏరియాలో 50 శాతానికి పైగా IT, ITES సేవలు ఉంటాయి. నాన్-ఐటి లేదా నాన్ ITES సేవలు మొత్తం బిల్ట్ అప్ ఏరియాలో 50 శాతం కంటే తక్కువగా ఉంటాయి.

IT, ITES సేవల క్రింద, ప్లగ్ అండ్ ప్లే కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు ఉంటాయి. నాన్‍ఐటి,నాన్ ఐటిఇఎస్ సేవల కింద, ఈ స్థలాన్ని నివాస, వాణిజ్య, ఆతిథ్య ప్రయోజనాల నిర్మాణానికి ఉపయోగించవచ్చు.

బిడ్డర్‌ల అభ్యర్థనలతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని, TSIIC బిడ్‌ల సమర్పణకు చివరి తేదీని జనవరి 4 వరకు పొడిగించింది. IT హబ్‌లను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగరం దక్షిణ భాగంతో పాటు, ఉత్తర భాగంపై కూడా దృష్టి సారించింది.

గత ఫిబ్రవరిలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో గేట్‌వే ఐటీ పార్కుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 అంతస్తుల నిర్మాణాన్ని 8.5 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇది 50,000 మందికి పైగా ఉపాధి కల్పించనుంది.

ఇవి కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కారిడార్‌లను రాష్ట్రంలోని టైర్ I మరియు టైర్ II పట్టణాలు, నగరాలకు కూడా విస్తరిస్తోంది. సిద్దిపేటలో ఐటీ హబ్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. నల్గొండలో ఐటీ హబ్‌ను రెండు నెలల్లో సిద్ధం చేయనున్నారు. మరికొద్ది నెలల్లో నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో హబ్‌లు కూడా సిద్ధం కానున్నాయి.

Tags:    
Advertisement

Similar News