`బాహుబలి-3`పై అప్పుడే హింట్ ఇచ్చిన జక్కన్న..!
తాను చేసిన చిత్రాల్లో ఒకే ఒక సినిమా క్లయిమాక్స్‌లో మాత్రం ఓపెన్ ఎండ్‌గా ఓ సంభాషణను పెట్టానని తెలిపాడు. అది ఎందులోనో కాదు.. `బాహుబలి-2` ఎండ్ క్రెడిట్స్‌లోనే. సినిమా పూర్తయి.. చివర్లో పేర్లు వస్తుండగా.. ఓ చిన్న పాప వాయిస్ ఓవర్‌తో.. ఈ హింట్ ఉంది.
ఒక తెలుగు సినిమా వరల్డ్ వైడ్‌గా రికార్డులు, సంచలనాలు సృష్టించగలదని నిరూపించిన చిత్రం `బాహుబలి`. ఈ చిత్రంతో తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా చర్చించుకునేలా చేశాడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. తన తొలి భాగం చివరలో ఇచ్చిన హింట్‌తో రెండో భాగంపై సినీ అభిమానుల్లో జక్కన్న కలిగించిన ఆసక్తి అంతా ఇంతా కాదు. `కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?` అంటూ సోషల్ మీడియాతో పాటు.. సినీ అభిమానులు, సినీ నటీనటుల్లోనూ ఎంతో ఉత్సుకత, ఆసక్తి రేకెత్తించాడు. ఈ చర్చ ఏ స్థాయిలో సాగిందంటే.. రెండో భాగం ఇంకెప్పుడు మొదలు పెడతారు.. ఎప్పుడూ పూర్తయి.. రిలీజవుతుంది.. ఈ సస్పెన్స్ ఎప్పుడు రివీలవుతుంది.. అని సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసేలా చేసిందంటే అతిశయోక్తి కాదు.
కలెక్షన్ల పరంగానూ వరల్డ్ వైడ్‌గా వివిధ భాషల్లో విడుదలై రూ.1800 కోట్ల వరకు కొల్లగొట్టింది ఈ చిత్రం. ఇక టాలీవుడ్ స్టార్‌గా ఉన్న ప్రభాస్‌ను ఎకా ఎకిన ప్యాన్ ఇండియా స్టార్‌ని చేసేసింది. అదే వరుసలో ఆయన వెంట బాలీవుడ్ నిర్మాతలు బారులు తీరారు. అందులో భాగంగానే ఆయన సినిమాలన్నీ ప్యాన్ ఇండియా రేంజ్‌లోనే రూపొంది జనం ముందుకు వస్తున్నాయి. వాటి ఫలితాల సంగతెలా ఉన్నా.. ప్రభాస్ క్రేజ్ మాత్రం అభిమానుల్లో కొనసాగుతూనే ఉంది.
ఇంతటి భారీ సంచలనాలకు కారణమైన బాహుబలి చిత్రానికి మూడో భాగం కూడా ఉంటుందని అప్పట్లోనే చర్చలు జరిగాయి. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా చర్చలు కొనసాగాయి. దీనిపై రాజమౌళి మాత్రం పెదవి విప్పలేదు. ఆ తర్వాత ఆయన తన తర్వాతి ప్రాజెక్ట్ ని రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో ప్లాన్ చేసి ప్రకటించడంతో `బాహుబలి` తర్వాతి భాగంపై చర్చలు సద్దుమణిగాయి.
ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్.. సృష్టించిన ప్రభంజనంతో ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమ దృష్టిని రాజమౌళి ఆకర్షించారు. ఒక దశలో ఆస్కార్ బరిలోనూ ఈ చిత్రం నిలుస్తుందని వార్తలు వచ్చాయి. ఈ దశలోనే తన తర్వాతి చిత్రం మహేష్‌బాబుతో ఉంటుందని, అది వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తామని జక్కన్న ప్రకటించడం తెలిసిందే.
తాజాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న మూవీ మారథాన్ ఈవెంట్ సందర్భంగా `బాహుబలి-3` పై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. సెప్టెంబరు 30న ప్రారంభమైన ఈ ఈవెంట్ అక్టోబర్ నెలాఖరు వరకూ కొనసాగనుంది. ఈ ఈవెంట్‌లో రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్, బాహుబలి, ఈగ చిత్రాలను ప్రదర్శించారు. రానున్న రోజుల్లో మరికొన్ని చిత్రాలనూ ఇందులో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగానే ఈ ఈవెంట్‌లో భాగంగా రాజమౌళితో మేనేజ్‌మెంట్ `క్యూ అండ్ ఏ` (క్వశ్చన్ అండ్ ఆన్సర్) సెషన్ నిర్వహించింది. అందులో భాగంగా అనుప్ దాసరి అనే ఓ నెటిజన్ `బాహుబలి-3` చిత్రంపై ట్వీట్ చేశాడు. ఈ భాగం తీస్తానని జక్కన్న అప్పట్లోనే చెప్పాడంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
దీనిపై రాజమౌళి మాట్లాడుతూ.. తాను చేసిన చిత్రాల్లో ఒకే ఒక సినిమా క్లయిమాక్స్‌లో మాత్రం ఓపెన్ ఎండ్‌గా ఓ సంభాషణను పెట్టానని తెలిపాడు. అది ఎందులోనో కాదు.. `బాహుబలి-2` ఎండ్ క్రెడిట్స్‌లోనే. సినిమా పూర్తయి.. చివర్లో పేర్లు వస్తుండగా.. ఓ చిన్న పాప వాయిస్ ఓవర్‌తో.. ఈ హింట్ ఉంది. దీనికి ఈ సినిమాలో స్వామీజీగా నటించిన తనికెళ్ల భరణి సమాధానం కూడా ఉంటుంది. అది బాహుబలి-3 కి సంబంధించిన సూచనే అనేది నెటిజన్ పాయింట్. ఇంతకీ ఈ విషయాన్ని ఆ సినిమా విడుదలై ఇన్ని రోజులైనా ఎవరూ గమనించినట్లు లేదు. అందుకే ఆ అంశం ఇప్పటివరకు చర్చనీయాంశం కాలేదు.
ఇంతకీ ఆ వాయిస్ ఓవర్‌లో ఏముందంటే.. బాహుబలి-2 క్లయిమాక్స్ తర్వాత పేర్లు పడుతున్నప్పుడు.. ఓ పాప.. `అంటే తాతా.. మహేంద్ర బాహుబలి కొడుకు మాహిష్మతికి మళ్లీ రాజవుతాడా..` అని అడుగుతుంది. దీనికి తనికెళ్ల భరణి సమాధానమిస్తూ.. `ఏమో.. శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటి ఎరుక..` అని చెబుతాడు. ఇప్పుడు అర్జంటుగా ఈ వాయిస్ ఓవర్ కోసం సెర్చ్ చేస్తున్న నెటిజన్లు మాత్రం `బాహుబలి-3` కోసం ఎదురు చూస్తున్నాం.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.