తెలుగు రాష్ట్రాలపై ఆశలు వదిలేసుకుందా?

తాజా బడ్జెట్ చూస్తే ఇటు తెలంగాణకు కానీ అటు ఏపీకి కానీ పెద్దగా ఒరిగిందేమీలేదు. పలానా ప్రాజెక్టుకు ఇన్ని నిధులు కేటాయిస్తున్నామని చెప్పుకునేందుకు బడ్జెట్‌లో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. పొరుగునే ఉన్న క‌ర్ణాట‌క‌కు మాత్రం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది కేంద్రం.

Advertisement
Update:2023-02-02 12:10 IST

తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే విషయమై బీజేపీ అరుపులు, చాలెంజ్‌లు ఎలాగున్నా తాజా బడ్జెట్ చూస్తే మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇటు తెలంగాణకు కానీ అటు ఏపీకి కానీ బడ్జెట్‌లో పెద్దగా ఒరిగిందేమీలేదు. పలానా ప్రాజెక్టుకు ఇన్ని నిధులు కేటాయిస్తున్నామని చెప్పుకునేందుకు బడ్జెట్‌లో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. పొరుగునే ఉన్న క‌ర్ణాట‌క‌కు మాత్రం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది కేంద్రం.

ఎందుకంటే తొందరలోనే క‌ర్ణాట‌క‌లో ఎన్నికలున్నాయి కాబట్టే. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రు. 5300 కోట్లు కేటాయించింది కేంద్రం. ఈ ప్రాజెక్టు వల్ల తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మొత్తుకుంటున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. క‌ర్ణాట‌క‌లో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్న కేంద్రం తాను క‌ర్ణాట‌క‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకునేందుకు కనీసం బడ్జెట్‌లో కేటాయింపులన్నా జరిపింది. రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే ఈ కేటాయింపులను ఏమి చేస్తుందో చూడాలి.

అయితే ఇదే పద్దతిలో తెలుగు రాష్ట్రాల్లో కనీసం కేటాయింపులు కూడా జరపలేదు. ఎన్నికలు ఎప్పుడు జరిపినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామే అంటు బీజేపీ నేతలు ఒకటే గోలగోల చేస్తున్నారు. మరలాంటప్పుడు తెలంగాణ అవసరాలను కేంద్రం ఎందుకు గుర్తించలేదు? తెలంగాణ అవసరాలకు ఎన్ని నిధులు కేటాయించినా ఉపయోగంలేదని అనుకోబట్టే బడ్జెట్‌లో తెలంగాణ ఊసే కనబడలేదనే అనుమానం పెరిగిపోతోంది. అధికారంలోకి వస్తామనే ఆశ ఏమాత్రమున్నా నరేంద్రమోడీ ప్రభుత్వం కనీసం కేటాయింపులన్నా జరిపుండేదే.

అధికారంలోకి రావటం ఖాయమని గోల జరుగుతున్న తెలంగాణ పరిస్థితే ఇలాగుంటే ఇక ఏపీ గురించి చెప్పుకునేందుకు ఏమీలేదు. పోటీ చేయటానికి పట్టుమని పది మంది గట్టి అభ్యర్థులు కూడా లేరు. ఈ కారణంగానే గడచిన తొమ్మిది బడ్జెట్లలో కూడా ఏపీకి నిధులను ఏమీ విదిల్చలేదు. జనాలు కూడా ఇందుకనే బీజేపీకి ఓట్లేయటం లేదు. సో, తాజా బడ్జెట్ కేటాయింపులను చూసిన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని మోడీ, అమిత్ షాకి బాగా అర్థ‌మైపోయుంటుంది.

Tags:    
Advertisement

Similar News