చలికాలం వీళ్లు జాగ్రత్త!
వాతావరణంలో వచ్చే మార్పులు శరీరంపై రకరకాల ప్రభావాల్ని చూపిస్తాయి. అందుకే చలికాలంలో ఆస్తమా రోగులు, హార్ట్ పేషెంట్లతోపాటు మరికొంతమంది జాగ్రత్తలు తీసుకోవాలి.
వాతావరణంలో వచ్చే మార్పులు శరీరంపై రకరకాల ప్రభావాల్ని చూపిస్తాయి. అందుకే చలికాలంలో ఆస్తమా రోగులు, హార్ట్ పేషెంట్లతోపాటు మరికొంతమంది జాగ్రత్తలు తీసుకోవాలి.
చలికాలంలో ముఖ్యంగా గుండె సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో అడ్రినలిన్, నారిటలిన్ వంటి కొన్ని హార్మోన్ల లెవల్స్‌లో మార్పులొస్తాయి. ఇవి రక్తప్రసరణలో మార్పులు తెస్తాయి. అలాగే చలికాలం రక్తనాళాలు సహజంగా ముడుచుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటప్పుడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు పెరిగే ప్రమాదముంది. కాబట్టి చలికాలం గుండె సమస్యలున్నవాళ్లు వేడిఆహారాలు ఎక్కువ తీసుకుంటుండాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తుండడం ద్వారా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూసుకోవచ్చు.
ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్లపై వైరస్‌లు త్వరగా ప్రభావం చూపుతాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ, జ్వరం వంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. కాబట్టి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు చలికాలంలో పండ్లు, కాయగూరలు, నట్స్ వంటివి ఎక్కువ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగుతుండాలి. అల్లం, తేనెతో చేసిన టీలు తాగాలి.
ఆయాసం, ఆస్తమా, సీఓపీడీ, బ్రాంకైటిస్, నిమోనియా వంటి శ్వాసకోశ సమస్యలున్నవాళ్లు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకూ చలికి ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు, స్వెటర్లు, గ్లౌజుల వంటివి ధరించాలి. వేడి ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, ఐస్‌వాటర్‌కు దూరంగా ఉంటే మంచిది.
జాగ్రత్తలు ఇలా..
చలికాలంలో చల్లగాలులకు దూరంగా ఉండడం ద్వారా శ్వాస ఇన్పెక్షన్లు, జలుబు, చర్మం పగుళ్లకు దూరంగా ఉండొచ్చు.
చలికాలంలో చల్లని ఆహారం తీసుకున్నా, ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉన్నా.. ఆస్తమా సమస్య పెరుగుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చలికాలంలో చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి మానేస్తే మంచిది.
చలికాలం గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. శ్వాస సమస్యలున్నవాళ్లు రోజుకోసారి ఆవిరి పట్టుకుంటే మంచిది.
చలికాలంలో జ్వరం, దగ్గు, జలుబు వంటివి మూడు రోజులకు మించి వేధిస్తుంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి.