ఎదిగే పిల్లలకు ఇలాంటి ఆహారం ఇవ్వాలి!

ఎదిగే వయసులో సరైన ఆహారాన్ని అందించకపోతే పిల్లల్లో ఎదుగుదల సమస్యలే కాదు.. బలహీనంగా మారడం, బరువు పెరగకపోవడం, బుద్ధి మందగించడం లాంటి సమస్యలు కూడా మొదలవుతాయి.

Advertisement
Update: 2024-06-23 00:45 GMT

పిల్లలు ఏది పెడితే అదే తింటారు. వాళ్లకు రుచే తప్ప అందులో ఉండే పోషకాల గురించి తెలియదు కదా. అందుకే వాళ్లకి ఏం పెడుతున్నాం, ఏం తింటున్నారు? అన్న విషయాన్ని తల్లిదండ్రులే చూసుకోవాలి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు సరైన పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలి.

ఎదిగే వయసులో సరైన ఆహారాన్ని అందించకపోతే పిల్లల్లో ఎదుగుదల సమస్యలే కాదు.. బలహీనంగా మారడం, బరువు పెరగకపోవడం, బుద్ధి మందగించడం లాంటి సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో డైట్ సరిగా ఉండాలి.

పిల్లలకు రోజులో 4 నుంచి 5సార్లు భోజనం తినిపించాలి. ఇందులో ఎక్కువ కూరగాయలు, పండ్లు, పాలు ఉండేలా చేస్తే ఇంకా మంచిది. పిల్లల్లో చిన్న వయసులోనే ఊబకాయం రాకూడదంటే ఆహారంలో గోధుమ, బియ్యం, ఓట్స్, కార్న్‌మీల్, బార్లీలాంటివి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇవేకాకుండా బ్రౌన్ రైస్, ఓట్‌మీల్స్ లాంటివి పిల్లల ఎదుగుదలకు మరింత ఉపయోగపడుతాయి. పాల ఉత్పత్తులను కూడా పిల్లలకు అలవాటు చేయాలి. అయితే ఇందులో ఫ్యాట్ ఫ్రీ ఉన్నవాటిని ఎంచుకోవాలి. వీటివల్ల వారికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది. అలాగే పిల్లలకు ప్రొటీన్ ఆహారం తప్పకుండా ఇవ్వాలి. దానికోసం చేపలు, నట్స్, లాంటివి పెట్టొచ్చు. అలాగే మాంసం విషయంలో తక్కువ కొవ్వు ఉండే మాంసాన్ని అలవాటు చేస్తే మంచిది.

తినకపోతే

రోజుకి రెండు మూడు జీడిపప్పులు, బాదంపప్పు వంటివి చేతికి ఇవ్వాలి. వాటిని తినకపోతే నట్స్‌ను పొడిచేసి.. ఫ్రూట్‌ సలాడ్‌ లేదా పాలల్లో కలిపి ఇవ్వాలి.

ఆకుకూరలు, పోషకాలు ఉన్న ఆహారం తినమని మొండికేస్తే వాటిని సమోసాల్లో, పరోటాల్లో కలిపి పెట్టాలి.

పిల్లలు పాలు తాగకపోతే .. పాలతో తయారు చేసిన కోవా, పనీర్‌, రసమలై వంటివి తినిపించాలి. క్యారెట్లు, బీట్‌రూట్లు తినకపోతే హల్వా, లౌజుల రూపంలో ఇవ్వొచ్చు.

మొలకెత్తిన విత్తనాలు తింటే పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే వారానికి రెండు సార్లయినా పిల్లలకు వాటిని ఇస్తుండాలి. ఒకవేళ వాటిని ఇష్టపడకపోతే.. వాటిల్లో నిమ్మరసం, కీర, క్యారెట్ వంటివి కలిపి వెరైటీగా అందించే ప్రయత్నం చేయాలి.

బొప్పాయి, కర్బూజ వంటి కొన్ని పళ్లను పిల్లలు ఇష్టపడరు. అలాంటప్పుడు వాటిని ఫ్రూట్‌సలాడ్లలో మిక్స్‌చేసి ఇవ్వాలి. లేదా వారు ఇష్టంగా తాగే జ్యూసుల్లో రెండు ముక్కలు మిక్సీలో వేసి కలిపేస్తే సరి.

Tags:    
Advertisement

Similar News