గుండె ఆరోగ్యం కోసం ఎప్పుడు వ్యాయామం చేయాలంటే..
Exercise for heart health: హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏ సమయంలో వ్యాయామం చేయాలి అన్న విషయంపై ఇటీవల కొన్ని అధ్యయనాలు జరిగాయి.
ఈ మధ్య కాలంలో తక్కువ వయసు నుంచే గుండె సమస్యలు మొదలవుతున్నాయి. గుండె సమస్యలను తగ్గించుకోవడం కోసం చాలామంది కార్డియో, రన్నింగ్, వాకింగ్, జంపింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్..లాంటి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏ సమయంలో వ్యాయామం చేయాలి అన్న విషయంపై ఇటీవల కొన్ని అధ్యయనాలు జరిగాయి. వాటిలో తెలిసిందేంటంటే..
'యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ'లో ప్రచురితమైన స్టడీ ప్రకారం వ్యాయామాలు ఏ సమయంలోనైనా చేయొచ్చని తెలిసింది. అయితే, ముఖ్యంగా ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య చేసే శారీరక శ్రమ వల్ల హార్ట్ స్ట్రోక్ ప్రమాదం తగ్గే అవకాశం ఉందని తేలింది.
ఈ స్టడీ కోసం 60 ఏళ్ల వయసున్న 86,657 మంది డాటాను పరిశీలించారు. ఉదయం చేసే వ్యాయామాల ద్వారా షుగర్, ఫ్యాట్‌లకు సంబంధించిన జీవక్రియలు సజావుగా జరుగుతాయట. వీటివల్ల అధిక బరువు, టైప్-2 డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటాయని రీసెర్చర్లు చెప్తున్నారు. అయితే, సాయంత్రం చేసే వ్యాయామాల వల్ల క్యాలరీలను బాగా ఖర్చు చేసే సత్తా పెరుగుతుందట. బరువు తగ్గడానికి, యాక్టివ్‌గా ఉండడానికి ఈవెనింగ్ వర్కవుట్లు బెటర్ అని వాళ్లు అంటున్నారు.