షుగర్ ఉన్నవారు ఏ కూరగాయలు తినాలి?
ఆరోగ్యంగా ఉండాలంటే పళ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు తరచుగా చెబుతుంటారు
ఆరోగ్యంగా ఉండాలంటే పళ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు తరచుగా చెబుతుంటారు. అయితే ఏ కూరగాయలు మనకు మరింత మేలు చేస్తాయి... అనే ప్రశ్నవేసుకుంటే స్టార్చ్ అనేరకం పిండిపదార్థాలు లేని కూరగాయలను తీసుకోవటం మంచిది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి ఈ తరహా కూరగాయలు మరింత మేలు చేస్తాయి. మరి పిండిపదార్థాలు లేని కూరగాయలు ఏవి, మధుమేహం ఉన్నవారు వాటిని తినటం వలన కలిగే లాభాలేంటి... అనే అంశాలను తెలుసుకుందాం...
ప్రతి కూరగాయలోనూ ప్రత్యేకమైన పోషకాలు, పీచు ఉంటాయి. అయితే స్టార్చ్ అనేరకం పిండిపదార్థాలు లేకుండా, పీచు ఎక్కువగా ఉన్న కూరగాయలు ఇన్సులిన్ నిరోధకతని తగ్గించి... రక్తంలో చెక్కర స్థాయి తగ్గేందుకు దోహదం చేస్తాయి. ఈ తరహా కూరగాయలను తినటం వలన రక్తంలో చెక్కరస్థాయి తగ్గి మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
పిండి పదార్థం లేని కూరగాయల్లో పీచు అత్యధికంగా ఉంటుంది. వీటిలో చెక్కర చాలా తక్కువ స్థాయిలో, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తరహా కూరగాయల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవి మన శరీరంలో ఏర్పడే ఇన్ ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. ఇన్ ఫ్లమేషన్ ఉన్నపుడు వాపు మంట లక్షణాలుంటాయి. పిండిపదార్థాలు లేని కూరగాయలు ఈ లక్షణాలను తగ్గించడం వలన గుండెవ్యాధులు, టైప్ టు డయాబెటిస్, కొన్నిరకాల క్యాన్సర్లు, ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
పిండిపదార్థాలు త్వరగా జీర్ణమైపోవటం వలన అవి రక్తంలో చెక్కర స్థాయిని త్వరగా పెంచేస్తాయి. తెల్లని అన్నం, పొటాటో చిప్స్, కార్న్ ఫ్లేక్స్, పాస్తా, తెలుపు బ్రెడ్, పాప్ కార్న్, మైదాపిండి, ఓట్స్చ్, గోధుమపిండి, ఇన్ స్టాంట్ నూడుల్స్, మొక్కజొన్న, బంగాళదుంపలు, బిస్కెట్లు, కేకులు, క్వినోవా లాంటి ధాన్యాలు, చిక్కుళ్లు, కుకీలు, పచ్చిపఠానీ ఇవన్నీ రక్తంలో చెక్కరని ప్రభావితం చేస్తాయి. పిండిపదార్థాలన్నీ చెడ్డవని కాదు... కానీ మనం ఆరోగ్యకరంగా భావించే ధాన్యాలు కూడా వాటిలో పిండిపదార్థాలుండటం వలన వాటిని తిన్నవెంటనే రక్తంలో చెక్కరని పెంచుతాయి. మధుమేహం ఉన్నవారు తక్కువ స్థాయిలో తినగల... పిండిపదార్థాలున్న ఆహారాలు... ముడిధాన్యాలు, బ్రౌన్ రైస్, అవిసె, చియా, గుమ్మడి, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, ముడిగోధుమలతో తయారుచేసిన రొట్టే మొదలైనవి. అందుకే అన్నాన్ని గంజి వార్చి తినటం వలన మధుమేహం, అధికబరువు తదితర సమస్యలను నివారించవచ్చని ఆయుర్వేదం చెబుతుంది.
పిండిపదార్థాలు లేని కూరగాయలు
పాలకూర, భిన్నరంగుల క్యాప్సికం, క్యాబేజి, క్యాలిఫ్లవర్, తోటకూర, బ్రొక్కోలి, ఆకుపచ్చని చిక్కుళ్లు, ముల్లంగి, క్యారట్లు, ఆకుకూరలు, గుమ్మడి, దోస, ఉల్లికాడలు, టమోట, నలుపు సోయాబీన్స్, వంకాయ, పుట్టగొడుగులతో పాటు అవకాడో, బ్లాక్, స్ట్రా, రాస్ బెర్రీలు, కమలా పళ్లు, ద్రాక్ష, నిమ్మ, పీచ్, ఆప్రికాట్, చెర్రీలు, పియర్స్ వంటివి కూడా పిండిపదార్థాలు లేనివే. వీటితో పాటు కొవ్వు లేని పాలను, పాల పదార్థాలను తీసుకోవచ్చు. అలాగే ట్యునా, సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్ కూడా మంచివే. వీటిలో కొవ్వు, పిండిపదార్థాలు ఉండవు. ప్రొటీన్, గుండెకు మేలు చేసే ఒమేగా 3 ప్యాటీ యాసిడ్లు, విటమిన్ డి హెచ్చుస్థాయిలో ఉంటాయి. డి విటమిన్ ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. డి విటమిన్ ఉంటేనే మన శరీరం క్యాల్షియంని శోషించుకుని వినియోగించుకుంటుంది.