కాళ్లు, పాదాల వాపును తేలికగా తీసుకోవద్దు

గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరంలోని నీరు పాదాల్లోకి చేరుతుంది. అటు ఇటు కలదకుండా కూర్చోడమే సాధారణ వాపులకు కారణం.

Advertisement
Update:2022-10-14 18:38 IST

ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే పాదాలు, కాళ్లలో వాపు కనిపించడం సాధారణమే. కొంత మందిలో ఇలాంటి వాపు అసలు తగ్గదు. వాచిన ప్రదేశంలో నొక్కితే గుంటలు కూడా పడుతుంటాయి. నొప్పి లేకుండా కేవలం వాపు ఉండటం వల్ల చాలా మంది దీన్ని తేలికగా తీసుకుంటారు. అయితే, అన్ని వాపులను తేలికగా తీసుకోవద్దని, శరీరంలోని మరో సమస్యకు ఈ వాపులు సంకేతమని వైద్యులు చెబుతున్నారు.

పాదాల వాపునకు సర్వ సాధారణమైన కారణం ఎక్కువ సేపు కూర్చొని ఉండటమే. గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరంలోని నీరు పాదాల్లోకి చేరుతుంది. అటు ఇటు కలదకుండా కూర్చోడమే దీనికి కారణం. ఏ వయసు వారికైనా ఈ వాపులు రావడం సహజమే. ఇవి పెద్దగా ప్రమాదకరమేమీ కాదు. చీలమండల్లో కూడా ఎక్కువ సేపు కూర్చుంటే వాపులు వస్తాయి. ఇవన్నీ కాసేపు నడిస్తే తగ్గిపోతాయి.

కొంత మంది పాదాల్లోని రక్తనాలాల్లో వాల్వ్‌లు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా వాపులు వస్తాయి. పాదాల్లోని రక్తనాళాలు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పని చేయాల్సి ఉంటుంది. ఇవి సరిగా పని చేయకపోతే పాదాలు, కాళ్లలో నీరు చేసి వాస్తుంది. ఇలాంటి సమయంలో కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. సాధారణంగా ఫిజియోథెరపీ, వ్యాయామం ద్వారా ఈ వాపులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

న్యూరో సంబంధిత సమస్యల కారణంగా పాదాల్లో ఉండే చిన్న నాడులు పని చేయవు. డయాబెటిస్‌తో బాధపడే వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పాదాల్లో వాపు కనిపించడమే కాకుండా సూదులు గుచ్చినట్లు, మంటలు కూడా వస్తుంటాయి. కొన్ని సార్లు పాదాలు మొద్దుబారిపోవడం కూడా న్యూరో సమస్యకు సంబంధించినదే. ఇలాంటి వారు తప్పకుండా షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అంతే కాకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

గుండె జబ్బు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి లక్షణాల కారణంగా శరీరంలో అదనపు నీరు చేరుతుంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆ నీరంతా పాదాల వద్దకు చేరి వాపులా కనిపిస్తుంది. పాదాలతో పాటు ముఖం, కళ్లు కూడా వాచినట్లు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యంగా ఈ వాపు కిడ్నీల సమస్యకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇక ప్రెగ్నెన్సీ టైంలో శరీరంలో జరిగే మార్పుల వల్ల కాళ్లలో వాపులు కూడా వస్తాయి. ఈ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన వ్యాయామం లేకపోతే వారికి వెరికోస్ వీన్స్ అనే రక్తనాళాల సంబంధిత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వ్యాయామం, నడక వల్ల ఈ వాపులు తగ్గుతాయి. అప్పటికీ సమస్య అలాగే ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Tags:    
Advertisement

Similar News