కళ్లు తరచూ ఎర్రబడటానికి కారణాలు ఇవే

కంటి చూపులో తేడా రావడం చాలా సాధారణమే. కానీ కళ్లు ఎర్రబడటం అనేది కొంత మందిలో తరచూ జరుగుతూ ఉంటుంది. నిద్రలేమి కారణంగా, శరీరం అలసి పోవడం వల్ల కళ్లు ఎర్రబడుతుంటాయి.

Advertisement
Update:2022-10-03 17:15 IST

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. కళ్లు చాలా సున్నితమైనవే కాక.. మన శరీరంలో అత్యధికంగా ఎక్స్‌పోజ్ అయ్యేవి కూడా ఇవే. వీటిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నా.. తరచూ ఇన్‌ఫెక్షన్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా దుమ్ము, ధూళి కారణంగా కళ్లు ఎరుపెక్కుతూ ఉంటాయి. అంతే కాకుండా శరీరంలో ఇతర రోగాల కారణంగా కళ్లు ఎర్రబడటం గమనిస్తుంటాము. ఇలా తరచూ కళ్లు ఎర్రబడటం (బ్లడ్ షాట్) వెనుక అనేక కారణాలు ఉంటాయి.వాటిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కంటి చూపులో తేడా రావడం చాలా సాధారణమే. కానీ కళ్లు ఎర్రబడటం అనేది కొంత మందిలో తరచూ జరుగుతూ ఉంటుంది. నిద్రలేమి కారణంగా, శరీరం అలసి పోవడం వల్ల కళ్లు ఎర్రబడుతుంటాయి. అయితే అన్ని సమయాల్లో ఇదే కారణం కాకపోవచ్చు. కళ్లు ఎర్రబడటం అనేది మన శరీరంలో ఏదో అనారోగ్య సమస్యను సూచిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కంటి పొరపై ఉండే రక్తనాళాలు వాపునకు గురైనా, ఇన్ఫెక్షన్ వచ్చినా కళ్లు ఎర్రబడుతుంటాయి.

వైరల్ కంజువిక్టివైటస్.. సాధారణంగా 'పింక్ ఐ'గా పిలువబడే వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా కళ్లు ఎర్రబడుతుంటాయి. కంటిపొరపై నొప్పి, వాపు, మండుతున్న ఫీలింగ్ కారణంగా కళ్లు ఎర్రబడతాయి. కనుగుడ్డుపై ఉండే కంటిపొర వాపునకు గురైతే.. అది ఎర్రగా మారిపోతుంది. ఇది కచ్చితంగా కంటిలో ఏదో ఇన్‌ఫెక్షన్ ఉన్న విషయాన్ని తెలియజేస్తుంది. కళ్లు వాయడం, మంట పెట్టడం వీటి లక్షణాలు. ఇలా జరిగితే కచ్చితంగా కంటి డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.

ఇటీవల కోవిడ్ బారిన పడిన వారిలో కొన్ని సుదీర్ఘమైన సైడ్ ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి. సాధారణంగా కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించి దీర్ఘకాల ప్రభావం కనపడుతున్నది. ఈ రెండు అవయవాలు కనుక కోవిడ్ ప్రభావానికి గురైతే తప్పకుండా కళ్లు ఎర్రబడుతాయని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ తగ్గిపోయిన వారిలో కళ్లు తరచూ ఎర్రబడుతుంటే.. కంటి డాక్టర్‌ను సంప్రదించడం కంటే గుండె, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ వైద్యులను కలవాలి. కరోనా వైరస్ కంటి ద్వారా శరీరంలోకి ప్రవేశించిన వారిలో ఎక్కువగా కళ్లు ఎర్రబడుతుంటాయని నిపుణులు వెల్లడించారు.

దుమ్ము, ధూళి నిండిన గాలి పీల్చడం వల్ల తరచూ ముక్కుకు సంబంధించిన ఎలర్జీలు వస్తుంటాయి. దీని ప్రభావం కళ్ల మీద పడతాయి. అలాగే పెట్ డాగ్స్ నుంచి రాలే ఫర్ కారణంగా కళ్లకు సంబంధించిన ఎలర్జీలు వస్తుంటాయి. వీటి వల్ల కళ్లు ఎర్రబడటమే కాకుండా దురద, మంట వంటివి కూడా కలుగుతాయి. కాంటాక్ట్ లెన్స్ వాడే వాళ్లు తరచూ వాటిని శుభ్రం చేస్తుండాలి. శుభ్రంగా లేని, పగిలిన, పాత కాంటాక్ట్ లెన్స్ కారణంగా కళ్లపై ప్రభావం పడి ఎర్రగా మారతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే మన కంటికి సరిపోని సైజు ఉన్న కాంటాక్ట్ లెన్స్ వాడినా ఎర్రగా మారిపోతాయి. లెన్స్ రాత్రి పూట పెట్టుకోవడం, నిద్రపోయే సమయంలో తీయకపోవడం వల్ల ఎర్రగా మారతాయి. కంప్యూటర్ స్క్రీన్, మొబైల్ ఫోన్లు ఎక్కువ సమయం చూడటం వల్ల కూడా కళ్లు ఎర్రబడతాయి.ఇది కార్నియాపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు.

ఇక కొంత మందికి డ్రై ఐస్ సిండ్రోమ్ ఉంటుంది. ఎక్కువ సేపు స్క్రీన్ చూడం వల్ల కళ్లు పొడిబారతాయి. ల్యాప్‌టాప్, పీసీలపై పని చేసే వాళ్లు ప్రతీ అరగంటకు ఒకసారి ఐదు నిమిషాల సేపు కళ్లను మూసి ఉంచడం మంచిది. అలాగే తరచూ ఐ డ్రాప్స్ వాడుతూ కళ్లను లూబ్రికేట్ చేస్తుండాలని కూడా వైద్యులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News