సమ్మర్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే..
సమ్మర్‌లో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. ఎండల్లో తగినంత నీరు తాగకపోవడం, వేడి చేసే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంటుంది.
సమ్మర్‌లో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. ఎండల్లో తగినంత నీరు తాగకపోవడం, వేడి చేసే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంటుంది. దీనికి ఎలా చెక్ పెట్టాలంటే..
శరీరంలో తగినంత నీరు లేనప్పుడు యూరిన్‌లో యాసిడ్ ఎక్కువై మంట, నొప్పి వంటి సమస్యలు మొదలవుతుంటాయి. ముఖ్యంగా సమ్మర్‌లో ఈ సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. అయితే ఈ సమస్యకు మొదటి పరిష్కారం తగినన్ని నీళ్లు తాగడమే. దాంతోపాటు ఇంకొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
సమ్మర్‌లో తరచూ వేడి చేస్తుంటే అలాంటి వాళ్లు తప్పకుండా చలువ చేసే పదార్థాలైన కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ నీళ్లు, సబ్జా నీళ్లు వంటివి తాగుతుండాలి. తరచూ మూత్రం మంటగా అనిపిస్తుంటే దానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలి. లేకపోతే కిడ్నీ లేదా బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
యూరిన్ ఇన్ఫెక్షన్లు వేధిస్తున్నప్పుడు ఆల్కహాల్, బీరు వంటివి తాగడం మానుకోవాలి. బీరు తాగితే వేడి తగ్గుతుందని అపోహ పడుతుంటారు కొంతమంది. అందులో నిజం లేదు. ఆల్కహాల్ శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తుంది. తద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సమ్మర్‌లో ఆల్కహాల్ కు దూరంగా ఉంటే మంచిది.
యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే కాఫీ, టీలు కూడా తగ్గించాలి. కాఫీ వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వాటిని కొంతకాలం దూరం పెట్టడం మంచిది.
సమ్మర్‌లో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కాటన్ దుస్తులు ధరించొచ్చు. దీనివల్ల చెమట పట్టడం తగ్గి శరీరం నుంచి నీరు బయటకుపోకుండా ఉంటుంది.
సమ్మర్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నవాళ్లు తగినంత శుభ్రత పాటించడం అలవాటు చేసుకోవాలి. రోజుకి రెండు మూడు సార్లు స్నానం చేయాలి. ఉతికిన బట్టలనే వాడాలి. టాయిలెట్ కు వెళ్లిన ప్రతీసారి శుభ్రంగా కాళ్లు, చేతులు కడుక్కోవాలి.
ఇకపోతే సమ్మర్‌లో నూనె పదార్థాలు తగ్గించి కాయగూరలు తింటే యూరిన్ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీ,క్రాన్‌బెర్రీ వంటి పండ్లు, బార్లీ నీళ్లు యూరిన్ ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తాయి. ఎసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్స్ మంటను మరింత పెంచుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డైట్‌ను సరిగ్గా పాటిస్తే త్వరగా సమస్య తగ్గుతుంది.