వర్షాకాలంలో చర్మ సమస్యలు రావొద్దంటే..
జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వర్షాకాలంలో టోనర్ వాడొచ్చు. కాఫీ, చార్‌కోల్, ఆల్కహాల్, గ్రీన్‌టీ ఎక్స్‌ట్రాక్ట్‌లున్న టోనర్‌లను వాడితే ఈ సీజన్‌లో మంచిది.
వర్షాకాలంలో చర్మ సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ పెరగడం వల్ల ముఖం జిడ్డుగా మారడం, మొటిమలు రావడం ఎక్కువ అవుతుంది. ఇలాంటి సమస్యలు రాకుడందంటే వానాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..
♦ వర్షాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు సహజమైన నూనెలు రాస్తుండాలి. గ్లిజరిన్ ఉండే సబ్బుల వాడకం తగ్గించాలి. గాఢత తక్కువ ఉండే ఫేస్ వాష్, క్లెన్సర్లు వాడాలి.
♦ వర్షాకాలంలో తరచుగా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేషన్ లేదా స్క్రబ్ చేయడం మంచిది. అలా చేయడం వల్ల చర్మంపై మృత కణాలు తొలగి, చర్మరంధ్రాల్లో మలినాలు పోతాయి. చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది.
♦ వర్షాకాలంలో మేకప్ వేసుకోకపోవడమే మేలు. వాతావరణంలో ఉండే తేమ కారణంగా మేకప్ ఈజీగా చెదిరిపోతుంది. దానివల్ల లుక్ అంతా పాడవుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో చర్మ రంధ్రాలు మూసుకు పోయేలా మేకప్ వేయడాన్ని తగ్గించాలి. మాయిశ్చరైజర్, లిప్ బామ్ వంటివి లేదా తేలికపాటి మేకప్ లాంటివి వేసుకుంటే చాలు.
♦ మొటిమలు ఉన్నవాళ్లు కలబంద గుజ్జు, ఓట్స్, శాండల్ వుడ్ పౌడర్ వంటి వాటితో ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. వేడి నీటిలో లవంగం నూనె వేసి పదినిమిషాల పాటు ఆవిరి పట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మంపై టాక్సిన్స్ తొలగిపోతాయి.
♦ జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వర్షాకాలంలో టోనర్ వాడొచ్చు. కాఫీ, చార్‌కోల్, ఆల్కహాల్, గ్రీన్‌టీ ఎక్స్‌ట్రాక్ట్‌లున్న టోనర్‌లను వాడితే ఈ సీజన్‌లో మంచిది. రోజ్ వాటర్‌తో కూడా టోనింగ్ చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు వర్షాకాలం మంచి చర్మ సౌందర్యం కోసం విటమిన్ `సీ` తీసుకోవాలి. `సీ` విటమిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సాయపడుతుంది.