ఎండాకాలం మొదలైంది.. ఇక జాగ్రత్తపడాల్సిందే..
వేసవిలో డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు చర్మ సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చలికాలం పూర్తిగా పోనేలేదు.. ఎండలు మండి పోతున్నాయి. తెల్లవారిన కాసేపటికే సూర్యుడు భగ భగ మంటూ వచ్చేస్తున్నాడు. ఉదయం 7.30, 8 గంటల సమయం నుంచే వేడి వాతావరణం కనపడుతోంది. వేసవిలో డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు చర్మ సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూసేద్దాం
వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు మన శరీరం, ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వాతావరణాన్ని బట్టి మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకున్నప్పుడే అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలం. ఎండాకాలంలో శరీరం చల్లబడటానికి నీటి శాతం ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పుచ్చకాయ, ఖర్బూజ, మామిడికాయ, దానిమ్మ, జామకాయ లాంటి నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్ల వల్ల శరీరం డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఇక కూరగాయల్లో కీరదోస, దోసకాయ, క్యారెట్, సోరకాయ, బీరకాయలు వంటి నీటిశాతం అధికంగా ఉండేవి. అవి తీసుకుంటే వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఎండ చర్మాన్ని రకరకాలుగా దెబ్బతీస్తుంది. కాబట్టి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవటం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. రెడ్ క్యాప్సికం ఎక్కువగా తీసుకోవడం వల్ల వేసవిలో చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఇందులో సీ విటమన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో చర్మాన్ని కాపాడుతుంది. కమలా పండులో నీటి శాతం ఎక్కువ ఉండడం సహా విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. అలాగే వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల చలవ చేస్తుంది. వేసవిలో చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి. టమాటొ, క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయాల నుంచి బీటా కెరోటిన్ లభిస్తుంది. వీటితో పాటు మంచినీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ నుంచి బయటపడడం సహా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.