దేశంలో క్రమంగా పెరుగుతున్న బీపీ, డయాబెటిక్ బాధితులు : ది లాన్సెట్

దేశంలోని అన్ని రాష్ట్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని దశల వారీగా ఈ సర్వేను నిర్వహించారు.

Advertisement
Update:2023-06-09 17:37 IST

దేశంలో హై బీపీ, డయాబెటిక్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ జనాభాలో 11.4 శాతం మంది మధుమేహం బారిన పడినట్లు ది లాన్సెట్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలాజీ జర్నల్ నివేదికలో వెల్లడైంది. దేశంలో ప్రస్తుతం 35.5 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి మద్రాస్ డయాబెట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒక అధ్యయనం చేసింది. దీనికి సంబంధించిన నివేదికను లాన్సెట్ ప్రచురించింది.

2018-2020 మధ్యలో దేశవ్యాప్తంగా 1.1 లక్షల మందిపై సర్వే నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని దశల వారీగా ఈ సర్వేను నిర్వహించారు. ఈ క్రమంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో 15.3 శాతం మంది ప్రజలు ప్రీ-డయాబెటిక్ స్థితిలో ఉన్నారని.. 28.6 శాతం మంది ప్రజలు సాధారణ ఊబకాయం, 39.5 శాతం ప్రజలు ఉదర సంబంధిత ఊబకాయంతో బాధపడుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఇక 81.2 శాతం మంది ప్రజల్లో లిపిడ్స్ అసమతుల్యత ఉన్నట్లు గుర్తించారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని నివేదికలో పేర్కొన్నారు. దేశంలో డయాబెటిస్, ఇతర సంక్రమించని వ్యాధుల బాధితుల సంఖ్య గతంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో వీళ్ల సంఖ్య స్థిరంగానే ఉన్నా.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం క్రమంగా పెరగుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ప్రజల్లో ఇలాంటి ఆరోగ్య సమస్యలు ప్రమాదరకస్థాయికి చేరుతున్నందున వెంటనే అన్ని రాష్ట్రాలు తగిన ఆరోగ్య విధానాలు అమలులోకి తీసుకొని రావాలని ఆయా రాష్ట్రాలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం కూడా మధుమేహం, అధిక రక్తపోటు విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News