మనం వాడే సబ్బు దోమలకు నచ్చితే... ఇక అంతే...
దోమలు కొంతమందిని ఇతరులతో పోలిస్తే మరింత ఎక్కువగా కుడుతుంటాయి. దోమలు బాగా ఉన్న ప్రదేశంలోనే ఉన్నా కొందరిని అవి అంతగా కుట్టవు.
దోమలు కొంతమందిని ఇతరులతో పోలిస్తే మరింత ఎక్కువగా కుడుతుంటాయి. దోమలు బాగా ఉన్న ప్రదేశంలోనే ఉన్నా కొందరిని అవి అంతగా కుట్టవు. చాలా సందర్భాల్లో మనం ఈ విషయాన్ని గమనిస్తుంటాం.
అలా ఎందుకు జరుగుతుంది అనే అంశంపై ఎప్పటినుండో పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతమంది చర్మాల నుండి విడుదలయ్యే కొన్నిరకాల రసాయనాలు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయని, అలాంటివారిని అలాగే ‘ఓ’ బ్లడ్ గ్రూపు ఉన్నవారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
వర్జీనియా టెక్ అనే సంస్థ నిర్వహించిన పరిశోధనల్లో మరొక వినూత్న విషయం వెల్లడైంది. మనం వాడుతున్న సబ్బుని బట్టి కూడా దోమలను మనమెంతగా ఆకర్షిస్తున్నామనేది ఆధారపడి ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది.
పళ్లు, పూల వాసనలతో ఉన్న సబ్బులను వాడేవారిని దోమలు బాగా ఇష్టపడుతున్నాయని వారినే ఎక్కువగా కుడుతున్నాయని, కొబ్బరికి సంబంధించిన వాసనలను దోమలు ఇష్టపడటం లేదని పరిశోధన నిర్వాహకులు తేల్చారు. మన శరీర వాసనలు సుమారు అరవై శాతం మనం వాడే సబ్బుపైన, నలభైశాతం మన శరీర సహజ వాసనలపైన ఆధారపడి ఉంటాయని కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఐసైన్స్ అనే పత్రికలో ఈ వివరాలను ప్రచురించారు.
దోమలు ఎక్కువగా కుడుతున్న వ్యక్తులు తరువాత తమ సబ్బుని మార్చినప్పుడు దోమలు కుట్టటం తగ్గినట్టుగా పరిశోధకులు గుర్తించారు. పళ్లు పూలు వాసనలు వస్తున్న సబ్బులకు బదులుగా కొబ్బరినూనె వాసన వస్తున్న సబ్బులను వాడటం మంచిదని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరిన్నిరకాల సబ్బులను, వాసనలు వెదజల్లే డియోడరెంట్లు, డిటర్జెంట్లను సైతం పరిశోధనలో చేర్చనున్నారు.