నొప్పి మందులు... శరీరాన్ని పిప్పి చేస్తాయి...
శరీరంలో ఏ చిన్న నొప్పి ఉన్నా వెంటనే టాబ్ లేట్లు మింగుతుంటారు కొందరు. వెన్ను, తల, మెడ, నడుము, కాళ్లు చేతులు.. ఇలా ఏ శరీర భాగంలో నొప్పి ఉన్నా నొప్పిని తగ్గించే మందులను వేసేసుకుంటారు.
శరీరంలో ఏ చిన్న నొప్పి ఉన్నా వెంటనే టాబ్ లేట్లు మింగుతుంటారు కొందరు. వెన్ను, తల, మెడ, నడుము, కాళ్లు చేతులు.. ఇలా ఏ శరీర భాగంలో నొప్పి ఉన్నా నొప్పిని తగ్గించే మందులను వేసేసుకుంటారు. ద్వారకలోని మణిపాల్ హాస్పటల్స్ లో ఇంటర్నల్ మెడిసిన్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ సంజయ్ గుప్తా ఈ విషయంపై మాట్లాడుతూ... పెయిన్ కిల్లర్లు రెండు రకాలుగా ఉంటాయని... పారాసిటమోల్ సంబంధమైనవి ఒకరకమైతే, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ మరొక రకమని... రోజుకి ఒక గ్రాముకంటే ఎక్కువ మోతాదు చొప్పున పారాసిటమోల్ ని మూడునుండి నాలుగు నెలల పాటు తీసుకుంటే మూత్రపిండాలు, లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ విషయంపై ఆయన తెలిపిన వివరాలు ఇవి.
రోజుకి ఒక గ్రాముకి మించి పారాసిటమోల్ తీసుకోవటం వలన కలిగే హాని... నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ చేసే హానికంటే తక్కువే అయినా పారాసిటమోల్ మందులను ఎక్కువకాలం పాటు వాడకూడదని గుప్తా అన్నారు.
నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే ఇబుప్రొఫెన్ వంటివి. ఇక వీటి విషయానికి వస్తే... ఈ మందులు లివర్ కి హాని చేయటంతో పాటు అక్యూట్ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూత్రపిండాలకు శాశ్వత హానిని కలగజేసే ప్రమాదం ఉంటుంది. ఇవి అన్నవాహిక దిగువ భాగానికి కూడా హాని కలిగిస్తాయి. రెండు వారాలకు మించి ఈ మందులను తీసుకుంటే మూత్రపిండాలకు శాశ్వత హాని కలిగే ప్రమాదం ఉంటుంది.
నొప్పి మందులు తెచ్చే ఆరోగ్యనష్టాలు...
♦ లివర్ దెబ్బతినటం వలన కుడివైపు పక్కటెముకకు కింది భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.
♦ లివర్ లో తయారయ్యే పసుపు రంగు పదార్థం బిల్ రుబిన్, ఇతర ఎంజైములు పెరుగుతాయి. లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఇవి తెలుస్తాయి.
♦ లివర్ పనితీరు మందగించినప్పుడు రక్తంలోని గడ్డకట్టే లక్షణం తగ్గిపోయి రక్తం పలుచనైపోతుంది. దీనివలన శరీరంలో అనుకోకుండా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
♦ మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతిని... మూత్రం తక్కువగా తయారవుతుంది.
♦ కిడ్నీల పనితీరు మందగించడం వలన శరీరంలో వాపు గుణం పెరుగుతుంది. నడుస్తుంటే ఆయాసం వస్తుంది.
♦ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్ల వలన పొట్టలో అసౌకర్యం, నొప్పి, దగ్గు ఉంటాయి. సమస్య తీవ్రంగా ఉన్నవారిలో దగ్గినప్పుడు రక్తం పడుతుంది. నోటిద్వారా రక్తం పడుతుంటే అల్సర్ ప్రమాదకరంగా మారిందని గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.