భయంవేస్తే పొట్టలో గడబిడ ... మన పొట్ట రెండవ మెదడు

మనకు ఎప్పుడైనా చాలా భయం కలిగినప్పుడు లేదా ఆందోళనకు గురయినప్పుడు పొట్టపైన ఆ ప్రభావం కనబడుతుంది. అంటే పొట్టలో గడబిడగా చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది.

Advertisement
Update:2023-08-13 13:41 IST

భయంవేస్తే పొట్టలో గడబిడ ... మన పొట్ట రెండవ మెదడు

మనకు ఎప్పుడైనా చాలా భయం కలిగినప్పుడు లేదా ఆందోళనకు గురయినప్పుడు పొట్టపైన ఆ ప్రభావం కనబడుతుంది. అంటే పొట్టలో గడబిడగా చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. కొంతమందికి వాంతి వచ్చినట్టుగా, కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టుగా కూడా అనిపిస్తుంటుంది. మన భావోద్వేగాలకు, మన పేగులకు దగ్గరి సంబంధం ఉండటం వల్లనే అలా జరుగుతుంది. కోపం, ఆందోళన, దు:ఖం లాంటి భావోద్వేగాలు కలిగినప్పుడు వాటి ప్రభావం పొట్టమీద పడుతుంది. అంటే మెదడు ప్రభావం నేరుగా పొట్ట పేగులపైన ఉంటుంది. అందుకే ఆరోగ్యనిపుణులు పొట్టని సెకండ్ బ్రెయిన్ అని అభివర్ణిస్తుంటారు.

మన పొట్ట భాగాలను నియంత్రించే నరాల వ్యవస్థని ఎంటరిక్ నెర్వస్ సిస్టమ్ అంటారు. ఇది మన పొట్టలోని జీర్ణవ్యవస్థకు సంబంధించిన భాగాలకు లైనింగ్ లా ఏర్పడి అన్నవాహిక నుండి కిందభాగం రెక్టమ్ వరకు ఉంటుంది. మన మెదడులో ఉండే నాడీ కణాల్లాంటివే ఈ ఎంటరిక్ నాడీ వ్యవస్థలో కూడా ఉంటాయి. ఈ నాడీ కణాలు నరాల వ్యవస్థ ద్వారా మెదడుకి అనుసంధానమై ఉంటాయి. అందుకే పొట్ట మెదడు పరస్పర అనుసంధానంతో పనిచేస్తాయి. అంటే పొట్టలో ఆహారం జీర్ణం అవడానికి, భయం కలిగితే మెదడు అప్రమత్తం అవడానికి ఉపయోగపడుతున్న రసాయనాలు, నాడీకణాలు ఒకే రకమైనవి అన్నమాట. దీనిని శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన అంశంగా పరిగణిస్తున్నారు.

ఏదైనా నచ్చిన ఆహారం గురించి ఆలోచించినప్పుడు, ఆహారం తినబోతున్నపుడు... ఆహారాన్ని చూడకుండానే మెదడులోని ఊహల వల్ల పొట్టలో జీర్ణరసాలు స్రవిస్తుంటాయి. మెదడు పొట్ట మధ్య ఉండే అనుబంధం రెండు వైపులనుండి నడుస్తుంటుంది. పొట్ట బాగా లేకపోతే దాని తాలూకూ సంకేతాలు మెదడుకి వెళతాయి, అలాగే మెదడుకి సమస్య ఉంటే ఆ ప్రేరణలు పొట్టని ప్రభావితం చేస్తుంటాయి. దీనిని బట్టి మన పొట్టలోని పేగులు సమస్యకు ఒత్తిడికి గురయితే.. అది ఆందోళనగా మానసిక ఒత్తిడిగా డిప్రెషన్ గా మారే అవకాశం ఉంది.

ఏదైనా ఒత్తిడితో కూడిన పనిని లేదా భయాన్ని కలిగించే పనిని చేసేముందు కడుపులో తిప్పినట్టుగా వికారంగా అనిపిస్తుంది. మన మానసిక స్థితి మన పొట్టపైన చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందనే రుజువులు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒత్తిడికి డిప్రెషన్ కి గురయినప్పుడు మన జీర్ణవ్యవస్థలో కదలికలు, సంకోచాల్లో తేడా ఉంటుంది. అలాగే జీర్ణవ్యవస్థకు సంబంధించిన డిజార్డర్లు మెదడుపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారిలో వచ్చే పొట్టకు సంబంధించిన నొప్పులు ఏవైనా మరింత తీవ్రంగా ఉంటాయి. వీరి మెదడు పొట్ట నుండి వచ్చే నొప్పి సంకేతాలకు మరింత ఎక్కువగా స్పందించం వలన అలా జరుగుతుంది. ఒత్తిడికి గురవుతున్నవారికి సాధారణ నొప్పి కూడా తీవ్రంగా అనిపిస్తుంది.

దీనిని బట్టి జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాలున్నవారిలో కొందరికైనా యాంగ్జయిటీ, డిప్రెషన్, స్ట్రెస్ లను తగ్గించే థెరపీలు బాగా పనిచేసే అవకాశం ఉందని వైద్యనిపుణులు భావిస్తున్నారు. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నవారికి కేవలం మందులే కాకుండా మానసిక ప్రశాంతతనిచ్చే సలహాలు కూడా ఇవ్వటం వలన మంచి ఫలితాలు వచ్చినట్టుగా అనేక అధ్యయనాల్లో తేలింది.

ఆందోళన, డిప్రెషన్ లు మెదడుకి మాత్రమే కాకుండా పొట్టకు కూడా సంబంధించిన సమస్యలు కావచ్చని, అలాగే గుండెమంట పొట్టలో నొప్పులు విరేచినాలు వంటివి మానసికపరమైనవి కూడా అయ్యే అవకాశం ఉందనే అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. మానసిక పరమైన భయాలు ఒత్తిళ్లను, పొట్టకు సంబంధించిన అనారోగ్యాలను ఎదుర్కొంటున్నవారికి ఈ అవగాహన ఉంటే వైద్యులతో తమ సమస్య గురించి విపులంగా చర్చించి తగిన చికిత్స పొందే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అంటే మెదడు, పొట్ట సమస్యలను వేటికవి విడిగా కాకుండా రెండింటికి సంబంధించిన సమస్యలుగా భావించినప్పుడు మరింత త్వరగా సమర్ధవంతంగా తగిన చికిత్సని అందించే అవకాశం ఉంటుందన్నమాట.

Tags:    
Advertisement

Similar News