జీన్స్ వేసుకోండి.. కానీ మీ జీన్స్ మరిచిపోకండి
సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను మరిచిపోతేనే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందన్న చిదానంద సరస్వతి;
ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పరమార్థ నికేతన్ ఆశ్రమ గురువు.. ఆధ్యాత్మికవేత్త అయిన చిదానంద సరస్వతి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ... కుంభమేళా సమయంలో జరిగిన ఓ సంఘనను గుర్తుచేసుకున్నారు. తన వద్దకు ఓ యువకుడు వచ్చి తాను ఆధ్మాత్మికత వైపు దృష్టి పెట్టాలంటే.. ప్రస్తుతం వేసుకుంటున్న జీన్స్ వదిలిపెట్టి... సంప్రదాయ డ్రెస్సులు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుందా? అని ప్రశ్నించాడని తెలిపారు.
అయితే యువత ఎటువంటి డ్రెస్ వేసుకుంటున్నారన్నది కాదు.. ఎటువంటి విలువలు పాటిస్తున్నారనేది ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కుంభమేళాకు చాలామంది జీన్స్ ధరించి వచ్చారని, దాంతో ఎలాంటి ఇబ్బంది లేదని వివరించారు. అయితే వచ్చినవారు వారి జీన్స్ (మూలాలను), సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను మరిచిపోతేనే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని అన్నారు.
మహాకుంభమేళాకు రావాలనుకున్న మస్క్
ఈ కార్యక్రమంలో నిరంజని అఖాడా అధిపతి స్వామి కైలాసానంద గిరి మాట్లాడుతూ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కుంభమేళాకు రావాలని అనుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన మెసేజ్‌ను స్టీవ్ జాబ్స్ సతీమణి తమకు చేరవేశారని అన్నారు. కుంభమేళాలో ఏర్పాటు చేసిన తమ శిబిరంలో బస చేయడానికి మస్క్ ఆసక్తి చూపెట్టినట్టు పేర్కొన్నారు. కుంభమేళా నిర్వహణ గురించి మాట్లాడుతూ.. ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించినందుకు యూపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉండటం వల్లనే ఇది సాధ్యమైందని కైలాసానంద అన్నారు.