పిల్లలు చాక్ పీస్ తింటున్నారా..?

ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లలో, జీవనశైలిలో వస్తున్న మార్పుల వలన చాలామంది పోషకాల లోపానికి గురవుతున్నారు. తమ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకుని తగిన ఆహారాలను తీసుకోవటం ద్వారా పోషక లోపాన్ని తగ్గించుకోవచ్చు.

Advertisement
Update:2023-07-25 17:27 IST

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి చాలా రకాల పోషకాలు అందాలి. పోషకాలు లోపిస్తే ఆ ప్రభావం శరీరంలో ఏదో ఒక రూపంలో కనబడుతుంది. కొన్నిరకాల అనారోగ్యాలకు కేవలం పోషకాహార లోపమే కారణం కావచ్చు. కాకపోతే మనకు ఆ విషయం తెలియకపోవటం వలన లోపించిన పోషకాలను అందించే ఆహారాలను తినలేం. ఆ అవగాహనే ఉంటే ఆహారాన్ని ఔషధంగా భావించి తగినంత తీసుకోగలుగుతాం. కొన్నిరకాల పోషక లోపాల వలన కలిగే సమస్యలను, వాటి పరిష్కారానికి తినాల్సిన ఆహార ప‌దార్థాల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చర్మం పొడి బారటం, దురద..

చర్మం పొడిబారి దురదలు వస్తుంటే తాము తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు లేవని అర్థం చేసుకోవాలి. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన ఆరోగ్యకరమైన కొవ్వు సమకూరి ఈ సమస్యల నుంచి బయటప‌డొచ్చు. విత్తనాలు, కొవ్వుతో కూడిన చేపలు, మొక్కల ద్వారా లభించే నూనెలు వంటివి ఆహారంలో చేర్చుకోవటం మంచిది.

నెలసరిలో అధిక రక్తస్రావం

ఈ సమస్య ఉన్నవారిలో క్యాల్షియం, విటమిన్ `సి` లోపం ఉంటుంది. ఈ రెండు లోపించినప్పుడు రక్తం గడ్డ కట్టటంలో సమస్య ఏర్పడుతుంది. ఆహారంలో భాగంగా వాటిని తీసుకున్నపుడు అధిక రుతుస్రావం తగ్గుతుంది. పాలు, పాల నుంచి తయారయ్యే పదార్థాలు, ఆకుకూరలు, సోయాబీన్స్ వంటివి క్యాల్షియం కోసం, `సి` విటమిన్ కోసం ఆరెంజ్, నిమ్మ వంటి సిట్రస్ ఫ‌లాలు, స్ట్రాబెర్రీలు, యాపిల్, కివీ పళ్లు, క్యాప్సికం, టమాటాలు వంటివి తినాలి.

పిల్లలు చాక్ పీస్ తింటున్నారా..

పిల్లలు చాక్ పీస్‌లు, సుద్ద ముక్కలు, బలపాలు తింటుంటే వారిలో క్యాల్షియం లేదా ఐర‌న్ లోపం ఉండవచ్చు. ఇలాంటివారు శరీరానికి ఎలాంటి పోషకాలు అందని మట్టి, జుట్టు, పేపర్లు వంటివి తింటుంటారు. ముఖ్యంగా ఐర‌న్ లోపం ఉన్నప్పుడు మట్టి, చాక్ పీసులు తినాలనిపిస్తుంది. ఇలాంటివారికి ఐర‌న్ కోసం మాంసాహారం, సీఫుడ్, చిక్కుళ్లు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు, బఠానీ మొదలైన ఆహారాలను, సి విటమిన్‌ని ఇచ్చే వాటిని ఇవ్వాల్సి ఉంటుంది.

గురక పెట్టటం

చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. నిద్రలో తీవ్రమైన శబ్దం వచ్చేలా గురక పెడుతుంటారు. వీరికి స్లీప్ అప్నియా అనే నిద్రలేమి సమస్య ఉండవచ్చు. ఇలాంటి వారు అధిక బరువు ఉండి పొట్టి మెడని కలిగి ఉండే అవకాశం ఉంది. నిద్రలో తరచుగా శ్వాస అందకపోవటం వలన గురకపెడుతుంటారు. తేనె, పుదీనా, వెల్లుల్లి, పసుపు కలిపిన పాలు, ప్రొటీన్లు ఫ్యాటీ యాసిడ్లు ఉండే చేపలు, ఉల్లిపాయలు, సోయా పాలు వంటివి గురకని క‌ట్ట‌డి చేయ‌డంలో తోడ్పడతాయి.

పొడిబారిన కళ్లు

`ఏ` విటమిన్ లోపించడం వలన కళ్లు పొడిబారతాయి. మితిమీరిన కాంటాక్టు లెన్సెల వాడకం, కొన్నిరకాల మందులు, కంటికి అధిక శ్రమ లాంటివి సైతం కళ్లను పొడిబారేలా చేస్తాయి. ఆకుకూరలు, పాలు, గుడ్లు, క్యారట్లు, బొప్పాయి వంటి వాటిలో కంటికి మేలు చేసే `ఏ` విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

చిగుళ్ల నుండి రక్తం కారటం

`సి` విటమిన్ లోపం వలన ఈ సమస్య వస్తుంది. `సి` విటమిన్ లభించే వాటిని తీసుకోవటం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లలో, జీవనశైలిలో వస్తున్న మార్పుల వలన చాలామంది పోషకాల లోపానికి గురవుతున్నారు. తమ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకుని తగిన ఆహారాలను తీసుకోవటం ద్వారా పోషక లోపాన్ని తగ్గించుకోవచ్చు.


Tags:    
Advertisement

Similar News