వానల్లో... జీర్ణసమస్యలు రాకుండా...

వానాకాలంలో పలురకాల అనారోగ్యాలు మనపై దాడి చేస్తుంటాయి. ఈ సీజన్లో చాలామంది జీర్ణ సంబంధమైన వ్యాధులతో బాధపడుతుంటారు.

Advertisement
Update:2023-07-28 08:16 IST

వానాకాలంలో పలురకాల అనారోగ్యాలు మనపై దాడి చేస్తుంటాయి. ఈ సీజన్లో చాలామంది జీర్ణ సంబంధమైన వ్యాధులతో బాధపడుతుంటారు. వాతావరణంలో తేమ పెరగటం, ఆహారం నీటి కాలుష్యాలతో రోగనిరోధక శక్తి తగ్గిపోవటం, చల్లదనాల వలన జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం, అజీర్తి, ఎసిడిటీ లాంటి సమస్యలు వస్తుంటాయి. కలుషితమైన నీరు, ఆహారాల వలన విరేచినాలు, వాంతులు, కడుపునొప్పి, జ్వరం, తలనొప్పులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వానాకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు, జాగ్రత్తలను గురించి తెలుసుకుందాం...

-మన పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోబయాటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియాని పెంచే ఆహారాలను తీసుకోవాలి. ఇందుకోసం ప్రోబయాటిక్స్ అధికంగా ఉండే పెరుగు మజ్జిగ వంటివి అధికంగా తీసుకోవాలి

-జీర్ణక్రియ బాగా జరగాలన్నా, శరీరంలోని కలుషితాలు బయటకు పోవాలన్నా తగినంత నీరు తాగాలి. అయితే మరీ ఎక్కువ మోతాదులో నీటిని తాగటం కూడా మంచిది కాదని గుర్తుంచుకోవాలి. నీటితో పాటు హెర్బల్ టీ, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు, కొబ్బరినీళ్లు తాగుతూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది.

-వానాకాలంలో పచ్చి కూరగాయలు తినటం మంచిది కాదు. ఉడికించి తినటమే మంచిది. పచ్చి కూరగాయలపై ఉండే బ్యాక్టీరియా, వైరస్ లు పొట్టలో ఇన్ ఫెక్షన్లకు కారణం కావచ్చు. అలాగే జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, డబ్బాల్లో లభించే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆహారాలను పచ్చిగా లేదా సగం ఉడికించి తీసుకున్నపుడు వాటిపై ఈ కొలీ, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా చేరి ఆహారం హానికరంగా మారుతుంది.

-వానాకాలం తీపి పదార్థాలను ఎక్కువగా తినకూడదు. ఐస్ క్రీములు, చాక్ లేట్లు, స్వీట్లు, డిజర్టులు మొదలైన పదార్థాలు శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ని పెంచుతాయి. వాపు మంట లక్షణాలతో కూడిన స్థితిని ఇన్ ఫ్లమేషన్ అంటారు.

- ఆహారంలో భాగంగా పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, దాల్చిన చెక్క వంటివి తీసుకుంటూ ఉంటే అవి యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పసుపు, అల్లం జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడతాయి. పళ్లు కూరగాయలు ముడిధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకోవటం వలన వాటిలోని పీచు మలబద్ధకాన్ని నివారించి జీర్ణశక్తిని పెంచుతుంది. వీటితో పోషకాలు అధికంగా అందటమే కాకుండా పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.

- జీర్ణశక్తి బాగుండాలంటే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరిగితే అది జీర్ణవ్యవస్థపైన వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయటం, మనసుకి హాయినిచ్చే హాబీలకు సమయం కేటాయించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఇవి వద్దు...

-వానాకాలం చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఈ కాలంలో బయటి ఆహారాలు తినటం మంచిది కాదు. వానాకాలంలో ఉండే ఉష్ణోగ్రత బ్యాక్టీరియా ఫంగస్ ల పెరుగుదలకు అనుకూలంగా ఉండటం వలన ఆహారం నీరు కలుషితమై ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కనుక బయట దొరికే ఆహారాలను తినకూడదు.

-వానాకాలంలో వేడివేడిగా పకోడీ బజ్జీలు సమోసాలు వంటివి తినాలపించినా ఎక్కువగా తినకపోవటం మంచిది. ఈ తరహా పదార్థాలను ఎక్కువ తినటం వలన అజీర్తి, కడుపు ఉబ్బరం, విరేచినాలు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

-వానాకాలంలో నీటి కాలుష్యం హెచ్చుగా ఉండటం వలన చేపలు, ఇతర సీఫుడ్ ఇన్ ఫెక్షన్లను కలిగించవచ్చు. కనుక వాటిని మరీ అతిగా తినటం మంచిది కాదు.

Tags:    
Advertisement

Similar News