తల్లిపాలలో ప్లాస్టిక్ రేణువులు

సాధారణంగా మనం ఏదైనా స్వచ్ఛమైన, కల్తీలేని పదార్థం గురించి చెప్పాల్సివస్తే తల్లిపాలతో పోలుస్తుంటాం. ఎందుకంటే తల్లిపాలు అంతటి ఆరోగ్యకరమైనవి, అంతగా బిడ్డకు మేలు చేసేవి.

Advertisement
Update: 2023-08-16 07:43 GMT

సాధారణంగా మనం ఏదైనా స్వచ్ఛమైన, కల్తీలేని పదార్థం గురించి చెప్పాల్సివస్తే తల్లిపాలతో పోలుస్తుంటాం. ఎందుకంటే తల్లిపాలు అంతటి ఆరోగ్యకరమైనవి, అంతగా బిడ్డకు మేలు చేసేవి. అయితే అలాంటి తల్లిపాలు కూడా కలుషితమైపోతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.


ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో తల్లిపాలలో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నాయని తేలింది. కలుషితమైన ఆహారం, నీరు, వాటి ప్యాకింగులకు వాడే ప్లాస్టిక్ లు ఇంకా గాల్లో జనించే అతి సూక్ష్మమైన కాలుష్యాలు వంటివన్నీ కలిసి తల్లిపాలలో అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు చేరేలా చేస్తున్నాయని పరిశోధన వెల్లడించింది. కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు తల్లిపాలలో కనిపించడం అనేది శాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది. అలాగే తల్లులను సైతం భయపెడుతున్న అంశమిది.

తల్లిపాలను కలుషితం చేస్తున్న సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు ఐదు మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటున్నాయని, ఇవి అతిపెద్ద ప్లాస్టిక్ వస్తువులు కాలక్రమంలో విచ్ఛిన్నమవుతూ వాతావరణంలో ప్లాస్టిక్ చేరటం వలన లేదా టూత్ పేస్ట్, బాడీ స్క్రబ్, ఫేస్ వాష్ లాంటి సౌందర్య ఉత్పత్తుల్లో వాడే అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ లైన మైక్రోబీడ్స్ వలన... తల్లిపాలలో చేరుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.

రోమ్ లో వారం రోజుల వయసున్న శిశువులున్న 34మంది తల్లుల నుండి సేకరించిన పాలను పరిశోధకులు పరీక్షించగా అందులో 26మంది నుండి సేకరించిన పాలలో మైక్రోప్లాస్టిక్ లు కనిపించాయి. ఈ తల్లులు తీసుకున్న ఆహారాల్లో, వాడిన సౌందర్య సాధనాల్లో ప్లాస్టిక్ ప్యాకింగ్ లు ఉన్నాయా, ప్లాస్టిక్ సంబంధమైన ఉత్పత్తుల వాడకం జరిగిందా.. అనేది పరిశీలించినప్పుడు వారు అలాంటి వస్తువులను వాడటం, ఆహారాలను తీసుకోవటం జరగలేదని తేలింది. దీనిని బట్టి... పర్యావరణంలో కలిసిపోయి ఉన్న ప్లాస్టిక్ రేణువులను తప్పించుకోలేని స్థితిలో మనం ఉన్నామని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

అతిసూక్ష్మమైన ప్లాస్టిక్ లు గర్భవతుల్లోని మాయలో ఉన్నట్టుగా 2020లో నిర్వహించిన ఓ పరిశోధనలో కనుగొన్నారు. ఇంకా మానవ రక్తంలో, ఆవు పాలల్లో, పిల్లలకు పాలు పట్టే బాటిల్స్ లో కూడా మైక్రో ప్లాస్టిక్ లు ఉన్నట్టుగా ఇతర అధ్యయనాలలో గమనించారు.

తల్లిపాలలోని సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల వలన బిడ్డకు కలిగే నష్టం గురించిన పరిశోధనలు ఇంకా నిర్వహించలేదు. అయినప్పటికీ గర్భవతులు ప్లాస్టిక్ ప్యాకింగు తో ఉన్న ఆహారాలు పానీయాలను తీసుకోకూడదని, ఈ విషయంలో వారు అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ పరిశోధనల వలన తాము తల్లిపాలు బిడ్డకు ఇవ్వటంలో పరిమతులు ఉండాలని భావించడం లేదని, కాకపోతే ప్రజలు ఈ విషయంలో అవగాహన పెంచుకుని తమ చుట్టూ ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండేలా తమ పాలకులను ప్రశ్నించాలని వారు ఆశిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News