మానసిక ఆరోగ్యం... ఈ నిజాలు తెలుసామీకు?
ప్రపంచవ్యాప్తంగా 26.4 కోట్లమంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ఇక యాంగ్జయిటీ డిజార్డర్ల గురించయితే చెప్పనక్కర్లేదు. మానసిక సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 26.4 కోట్లమంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ఇక యాంగ్జయిటీ డిజార్డర్ల గురించయితే చెప్పనక్కర్లేదు. మానసిక సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ మన సమాజంలో శారీరక అనారోగ్యాల పట్ల ఉన్నంత అవగాహన, శ్రద్ధ మానసిక అనారోగ్యాల పట్ల ఉండటం లేదు. మెంటల్ హెల్త్ విషయంలో ఎన్నో రకాల అపోహలు మన చుట్టూ ఉన్నాయి. అలాంటి కొన్ని అపోహలను, వాటివెనక ఉన్న వాస్తవాలను గురించి తెలుసుకుందాం.
♦ చాలామంది... మానసిక సమస్యలు మానసికంగా బలహీనంగా ఉన్నవారికే వస్తాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మానసిక శక్తికి మానసిక అనారోగ్యాలకు సంబంధం లేదు. జన్యుపరమైన కారణాలు, పుట్టిపెరిగిన వాతావరణం, జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు... ఇలా పలురకాల అంశాలు మానసిక సమస్యలకు దారితీస్తాయి.
♦ చిన్నపిల్లల్లో, యువతలో మానసిక సమస్యలు ఉండవనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంటుంది. కానీ ఇది కూడా అపోహే... నిజం కాదు. వయసుతో సంబంధం లేకుండా ఎవరిలో అయినా మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్న వయసు వారిలో మానసిక సమస్యలు ఉన్నపుడు వాటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా నయం చేసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంపాటు వాటితో బాధపడే ప్రమాదాన్ని నివారించే అవకాశం కూడా కలుగుతుంది.
♦ మానసిక సమస్యలతో బాధపడేవారు హింసాత్మకంగా ప్రవర్తిస్తారని, వారు ఎప్పుడు ఎలా ఉంటారో అంచనా వేయలేమని చాలామంది భయపడుతుంటారు. కానీ ఇది కూడా నిజం కాదు. ఎలాంటి మానసిక అనారోగ్యం లేనివారే ఎక్కువగా నేరాలు దారుణాలు చేయటం మనం చూస్తుంటాం.
♦ మానసిక అనారోగ్యాలున్నవారంతా ఒకేరకంగా ప్రవర్తిస్తారని అన్ని రకాల మానసిక అనారోగ్యాలు ఒకటేననే అపోహ కూడా మన సమాజంలో ఉంది. కానీ మానసిక సమస్యలు పలురకాలు. అలాగే వాటికి కారణాలు, లక్షణాలు, వాటివలన తలెత్తే సమస్యలు సైతం పలురకాలుగా ఉంటాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, బోర్డర్ లైన్ పర్సనాలిటీ... ఇలా అనేక రకాల మానసిక అనారోగ్యాలు ఉంటాయి. అవి రావడానికి కారణాలు వాటి వలన వచ్చే సమస్యలు అన్నీ భిన్నంగా ఉంటాయి. అలాగే వీటన్నింటికీ చికిత్సలు సైతం పలురకాలుగా ఉంటాయి.
♦ మానసిక సమస్యలకు థెరపీని చికిత్సగా ఇస్తుంటారు. అయితే థెరపీని చాలా తీవ్రమైన సమస్యలకు మాత్రమే వాడుతుంటారని కొంతమంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. థెరపీని తక్కువ స్థాయి మానసిక సమస్యలకు సైతం ఇస్తుంటారు. థెరపిస్టులు మానసిక సమస్యనుండి బయటపడే వ్యూహాలను చెబుతారు. అలాగే భావోద్వేగపరమైన సపోర్టుని అందిస్తారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన సూచనలు సలహాలు ఇస్తారు. సమస్య బాగా తీవ్రంగా మారాకే థెరపీ తీసుకోవాలని అనుకోవటం వలన చాలామంది తమ సమస్యలు తక్కువ స్థాయిలో ఉన్నపుడు నిర్లక్ష్యం చేస్తుంటారు.
♦ మానసిక సమస్యలకు మందులు మాత్రమే పరిష్కారమని తప్పనిసరిగా మందులు వాడాలని కొంతమంది అనుకుంటారు. అయితే మానసిక అనారోగ్యాలకు మందులతో పాటు పలురకాల చికిత్సా విధానాలను వైద్యులు అనుసరిస్తుంటారు. మందులు ఒక్కటే పరిష్కారం కాదు. మందులతో పాటు థెరపీ, జీవనశైలి మార్పులు, సామాజిక అండ వంటివి కూడా అత్యవసరం.
♦ దైవం పట్ల నమ్మకం లేకపోవటం వలన, విల్ పవర్ లేకపోవటం వలన మానసిక అనారోగ్యాలు వస్తుంటాయని కొంతమంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. మానసిక సమస్యలకు ఆధ్యాత్మిక నమ్మకాలకు సంబంధం లేదు. అలాగే విల్ పవర్ లేకపోవటం వలన మానసిక అనారోగ్యాలు వస్తాయనటంలో కూడా నిజం లేదు. పలురకాల వైద్యపరమైన సంక్లిష్టమైన అంశాలు మానసిక సమస్యలకు కారణమవుతుంటాయి.
♦ అసలు మానసిక అనారోగ్యాలకు చికిత్సే లేదని, వాటికి గురయినవారు జీవితాంతం వాటిని భరిస్తూనే ఉండాలనే అపోహ కూడా చాలామందిలో ఉంటోంది. కానీ ఇది నిజం కాదు. మానసిక సమస్యలకు తప్పకుండా చక్కని చికిత్సలున్నాయి. సరైన చికిత్స, శ్రద్ధ, అండదండలు ఉంటే మానసిక అనారోగ్యాలనుండి బయటపడటం లేదా వాటిని నియంత్రణలో ఉంచుకుంటూ సాధారణ జీవితాన్ని గడపటం సాధ్యమవుతుంది.