పురుషుల్లో ఆ కణాలు తగ్గుతున్నాయ్..! - తాజా అధ్యయనంలో వెల్లడి
ప్రపంచంలోని 53 దేశాల్లో చేసిన అధ్యయనం ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ అధ్యయనం వివరాలు `హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్` మంగళవారం ప్రచురితమయ్యాయి.
పురుషుల్లో వీర్యకణాలు గణనీయంగా తగ్గిపోతున్నాయట. మానవ జాతుల మనుగడపై దీని ప్రభావం ఉంటుందట. ప్రపంచంలోని 53 దేశాల్లో చేసిన అధ్యయనం ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ అధ్యయనం వివరాలు `హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్` మంగళవారం ప్రచురితమయ్యాయి.
అంతర్జాతీయ పరిశోధకుల బృందం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో గత కొన్నేళ్లుగా పురుషుల్లో వీర్య పుష్టి (స్పెర్మ్ కౌంట్) గణనీయంగా తగ్గుతున్నట్టు గుర్తించింది. వీర్యపుష్టిలో క్షీణతను మానవ పునరుత్పాదక లోపంగానే కాకుండా, పురుషుల ఆరోగ్య కోణంలోనూ చూడాల్సి ఉంటుందని ఈ బృందం పేర్కొంది.
ఆరోగ్యంపై దుష్ఫలితాలెన్నో...
పురుషుల్లో వీర్య పుష్టి తగ్గితే ఆరోగ్య పరంగా అనేక దుష్ఫలితాలు వచ్చే ప్రమాదముందని ఆ బృందం తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్, జీవితకాలంలో తగ్గుదల వంటి ప్రమాదాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ క్షీణతను ఆధునిక పర్యావరణ పరిస్థితులు, జీవన శైలుల పరంగా ప్రపంచ సంక్షోభమని పరిశోధకులు వెల్లడించారు.
భారత్‌లోనూ...
అధ్యయనం చేసిన దేశాల్లో భారత్ కూడా ఉందని ఈ బృందం వెల్లడించింది. భారతదేశంలోనూ బలమైన, స్థిరమైన క్షీణత ఉందని తమ నిశ్చితాభిప్రాయమని స్పష్టం చేసింది. మిగతా దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఇజ్రాయిల్‌లోని జెరూసలేంకు చెందిన హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ హగాయ్ లెవిన్ తెలిపారు. మొత్తానికి గత 46 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 50 శాతం వీర్యపుష్టి తగ్గిందని, ఇటీవల కాలంలో తగ్గుదల వేగం మరింత పెరిగిందని ఆయన వివరించారు.
ప్రపంచ దేశాలు తక్షణం స్పందించాలి...
ఈ సమస్యపై అధ్యయనం చేసిన ఈ బృందం.. దీనికి గల కారణాలపై దృష్టి పెట్టలేదు. జీవనశైలి ఎంపికలు, పర్యావరణంలో రసాయనాల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని లెవిన్ వెల్లడించారు. ఈ సమస్యపై ప్రపంచ దేశాలు తక్షణం స్పందించాలని తాము కోరుతున్నట్టు ఆయన చెప్పారు.