వేగంగా బరువు తగ్గించే మాంక్ ఫాస్టింగ్ గురించి తెలుసా?

ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది

Advertisement
Update:2024-02-07 15:44 IST

ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లు ఉపవాసాలు చేస్తుంటారు. అయితే ఫాస్టింగ్‌లో కూడా పలు రకాలున్నాయి. వీటిలో ‘మాంక్ ఫాస్టింగ్’ అనే ఓ కొత్త పద్ధతి ఇప్పుడు పాపులర్ అవుతోంది. ఇదెలా ఉంటుందంటే..

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వాటర్ ఫాస్టింగ్.. ఇలా ఉపవాసాల్లో రకరకాల విధానాలు ఉన్నాయి. అయితే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. మాంక్ ఫాస్టింగ్ అనే కొత్తరకం ఉపవాసాన్ని ఫాలో అవుతారట. ఫిట్‌గా, యాక్టివ్‌గా కనిపించేందుకు ఇదే ఆయన ఫార్ములా అని చెప్తున్నారు. దాంతో ఇప్పుడీ మాంక్ ఫాస్టింగ్ టాపిక్ ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

మాంక్ ఫాస్టింగ్ అంటే సన్యాసులు, సాధువులు పాటించే ఉపవాసం అని అర్థం. ఇందులో 36 గంటల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు. కేవలం నీళ్లు, జ్యూస్‌ల వంటివి మాత్రమే తీసుకుంటారు. ఈ తరహా ఉపవాసం వల్ల వేగంగా కొవ్వు కరగడంతో పాటు ఎప్పుడూ ఫిట్‌గా ఉండొచ్చట.

మాంక్ ఫాస్టింగ్‌తో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. 36 గంటలపాటు ఏమీ తినకుండా ఉండడం ద్వారా శరీరంలోని కొవ్వు వేగంగా కరగడం మొదలుపెడుతుంది. కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవడం ద్వారా శరీరంలోని మృతకణాలన్నీ తొలగిపోతాయి. అలా బాడీ అంతా డీటాక్స్ అవుతుంది. 36 గంటల పాటు శరీరానికి రెస్ట్ ఇవ్వడం ద్వారా హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుందట.

వీటితోపాటు లాంగ్ ఫాస్టింగ్ వల్ల ఒక రోజంతా పని మీద ఫోకస్ చేసేందుకు వీలు కుదురుతుంది. బాడీ మరింత యాక్టివ్‌గా పనిచేస్తుంది. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఫోకస్, మెమరీ కూడా మెరుగుపడతాయి.

నష్టాలు కూడా

ఇకపోతే ఈ ఫాస్టింగ్‌తో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ తరహా ఫాస్టింగ్ చేసేవాళ్లు ఉపవాసం లేని సమయాల్లో తగిన పోషకాహారం తీసుకోవాలి. పోషకాలన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి.

రక్తహీనత, అలసట, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు, గర్భిణులు ఈ ఉపవాసం జోలికి పోకపోవడమే మంచిది. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నవాళ్లు ఎక్కువసేపు ఉపవాసం చేస్తే ఒత్తిడి, చిరాకు వంటివి కలగొచ్చు. అలాగే అనారోగ్య సమస్యలున్న వాళ్లు ఇలాంటి ఉపవాసాలు చేసేముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.

Tags:    
Advertisement

Similar News