మార్షల్ ఆర్ట్స్ ఫిట్‌నెస్ గురించి తెలుసా?

ఫిట్‌నెస్‌లో రోజుకో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య అందరూ ఇష్టపడుతున్న మరో కొత్త ఫిట్‌నెస్ స్టైల్ ‘మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫిట్‌నెస్’. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు ఈ ఫిట్‌నెస్ స్టైల్ బాగా నచ్చుతోంది.

Advertisement
Update:2024-01-03 10:41 IST

ఫిట్‌నెస్‌లో రోజుకో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య అందరూ ఇష్టపడుతున్న మరో కొత్త ఫిట్‌నెస్ స్టైల్ ‘మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫిట్‌నెస్’. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు ఈ ఫిట్‌నెస్ స్టైల్ బాగా నచ్చుతోంది. ఈ వర్కవుట్స్‌తో కేవలం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడమే కాకుండా అవసరమైనప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.

కరాటే, కుంగ్ ఫూ, బాక్సింగ్ వంటి మార్షల్ ఆర్ట్స్‌లోని మూవ్‌మెంట్స్‌ను ఫిట్‌నెస్ కోసం ఉపయోగించడమే ‘మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫిట్‌నెస్’ అంటే. ఇందులో పూర్తి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఉండదు. రెగ్యులర్ వర్కవుట్స్‌కి మార్షల్ ఆర్ట్స్ టచ్ ఇస్తారు అంతే. మార్షల్ ఆర్ట్స్‌లో చేసే విన్యాసాల్లో కొన్నింటిని ఫిట్‌నెస్ వర్కవుట్లుగా మార్చి ఈ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫిట్‌నెస్‌ని రూపొందించారు.

పంచ్‌లతో వర్కవుట్స్‌

బాక్సింగ్‌లో ఇచ్చే పంచ్‌లు, కరాటేలో ఇచ్చే కిక్‌లు ఇలా అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ వర్కవుట్లు ఇందులో ఉంటాయి. ఎప్పుడూ ఒకే తరహా వ్యాయామంతో బోర్‌గా ఫీలయ్యేవారికి ఇవి మంచి కిక్‌నిస్తాయి. ఫిట్‌నెస్‌లో బాక్సింగ్‌, కరాటే, కుంగ్‌ఫూ కలిపి చేయడం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఈ వ్యాయామం వల్ల శరీరానికి పూర్తిస్థాయిలో వర్కవుట్‌ లభిస్తుంది. అంతేకాక కండరాలు పటిష్టంగా మారి, బాడీ స్ట్రెంత్ పెరుగుతుంది. రోజూ ఈ వ్యాయామం చేస్తే బరువు కూడా తగ్గుతారు. చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్‌లు తేలిగ్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే, వీటిని కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా ట్రైనర్‌ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో నేర్చుకుని తర్వాత ఇంట్లో కూడా చేసుకోవచ్చు.

మోకాలి స్ట్రైక్

ఎడమ కాలిని కింద ఉంచి కుడి కాలిని పైకి ముడవాలి. చేతులు రెండూ పిడికిలి బిగించి కుడి చేతిని ముందుకు పెట్టి బాక్సింగ్ పోజ్‌లో ఉంచాలి. తర్వాత కాళ్లు మార్చడంగానీ లేదా కాలితో కిక్ ఇవ్వడంగానీ చేయొచ్చు. ఇలా చేతులు కాళ్లు మారుస్తూ ఇరవై నుంచి ముప్పై సార్లు చేయాలి.

స్ట్రైట్ పంచ్

కాళ్లను కాస్త ఎడంగా పెట్టి, మోకాళ్లు వంచి నిలబడాలి. రెండు చేతులు పిడికిలి బిగించి ఒక్కసారిగా ఎడమ చేతిని బలంగా ముందుకు చాపి గాలిలోకి పంచ్ ఇవ్వాలి. రెండు సెకన్లు ఆగి వెంటనే కుడిచేతితో పంచ్ ఇవ్వాలి. ఇలా వీలైనంత బలంగా , వేగంగా ఈ వర్కవుట్ చేయాలి. దీనివల్ల చేతులకు బలం వస్తుంది. ఇలా చేతులు మారుస్తూ ముప్పై నుంచి నలభై సార్లు చేయాలి.

కార్డియో బాక్సింగ్

ఒక కాలు ముందుకు వంచి, బాక్సింగ్ గ్లౌజులతో ఎదుటి వాళ్లు ధరించిన ప్యాడ్స్‌పై బలంగా పంచ్‌లు ఇవ్వాలి. ఇలా చేతులు మారుస్తూ పంచ్‌లు ఇస్తుండాలి . దీన్నే కార్డియో బాక్సింగ్ , బాక్సింగ్ ప్యాడ్స్ ప్రాక్టీస్ అని కూడా అంటారు.

లాభాలెన్నో..

ఈ తరహా వ్యాయామాలు చేసేందుకు ఉత్సాహంగా అనిపిస్తాయిక. మానసిక స్థితి మెరుగుపడుతుంది. అత్యవసర సమయంలో మిమ్మల్ని మీరు కాపాడుకోటానికి సాయపడుతుంది.

ఈ వర్కవుట్స్ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ కెలొరీలు ఖర్చవుతాయి. కరాటే, బాక్సింగ్‌లో చేసే మూవ్‌మెంట్స్ చాలా వేగంగా ఉంటాయి. ఈ వర్కవుట్స్ వల్ల గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్‌గా చేసేవారికి 800- నుంచి 900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి.

ఇది ఫ్యాట్‌ని కరిగించడానికి కూడా బెస్ట్ ఆప్షన్. మొత్తం శరీరానికి వ్యాయామం అందుతుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఈ వ్యాయామాలతో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

ఇవి హై ఇంటెన్సిటీ వ్యాయామాలు. గుండె సమస్యలున్నవాళ్లు వైద్యుల సలహా మేరకు వీటిని చేస్తే మంచిది.

Tags:    
Advertisement

Similar News