సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఇలా చేస్తే చాలు!
సిక్స్ ప్యాక్ కావాలి అనుకునేవాళ్లు ముందుగా పొట్టదగ్గర ఉన్న కొవ్వుని కరిగించాల్సి ఉంటుంది. దానికోసం రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, ట్రెడ్ మిల్ వంటి వర్కవుట్లతో మొదలుపెట్టాలి.
చాలామంది అబ్బాయిలు సిక్స్ ప్యాక్ బాడీ కావాలని కోరుకుంటుంటారు. దానికోసం జిమ్‌లో కసరత్తులు చేస్తూ సప్లిమెంట్ల వంటివి తీసుకుంటుంటారు. అయితే వాటి అవసరం లేకుండా ఎంతో సింపుల్‌గా సిక్స్ ప్యాక్ శరీరాన్ని పొందొచ్చంటున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్స్. అదెలాగంటే..
బాడీని నచ్చిన విధంగా టోన్ చేయడం కోసం ముందుగా డైట్‌ను సరిచేయాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ అనేది 70 శాతం డైట్ 30 శాతం వర్కవుట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సిక్స్ ప్యాక్ కోసం ముందుగా డైట్ మీద ఫోకస్ పెట్టి కొన్ని పర్టిక్యులర్ వర్కవుట్స్ చేస్తే సరిపోతుంది.
కార్డియోతో మొదలుపెట్టి..
సిక్స్ ప్యాక్ కావాలి అనుకునేవాళ్లు ముందుగా పొట్టదగ్గర ఉన్న కొవ్వుని కరిగించాల్సి ఉంటుంది. దానికోసం రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, ట్రెడ్ మిల్ వంటి వర్కవుట్లతో మొదలుపెట్టాలి. ముందు కొంత బరువు తగ్గాక డైట్‌తో ఫిట్‌నెస్ ప్లాన్ మొదలుపెట్టాలి.
డైట్ ఇలా..
ఇక డైట్ విషయానికొస్తే.. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫైబర్ కంటెంట్ పెంచాలి. అంటే ఎక్కువ క్యాలరీలు ఉండే జంక్ ఫుడ్‌కు పూర్తిగా చెక్ పెట్టి ఫైబర్ కంటెంట్ ఉండే బ్రౌన్ రైస్, రోటీలు, ఓట్స్ వంటివి అలవాటు చేసుకోవాలి.
ఇక కండరాలు పెరగడానికి ప్రొటీన్ అవసరం కాబట్టి డైట్‌లో పప్పు ధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసం వంటివి చేర్చుకోవాలి. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసేవాళ్లు ట్రాన్స్ ఫ్యాట్స్‌ను పూర్తిగా తగ్గించాలి. హెల్దీ ఫ్యాట్స్ కోసం డ్రై ఫ్రూట్స్ తప్పక తీసుకోవాలి. అలాగే షుగర్ కంటెంట్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్ వంటివి మానేయాలి.
రెగ్యులర్ వర్కవుట్స్ చేసేవాళ్లు ఎవరైనా శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం నిమ్మరసం లేదా కొబ్బరినీళ్ల వంటివి తాగుతుండాలి. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
వర్కవుట్లు ఇవీ..
ఇక పోతే సిక్స్ ప్యాక్ కోసం కొన్ని ప్రత్యేకమైన ఎక్సర్‌సైజ్‌లు చేయాల్సి ఉంటుంది. ముందుగా అబ్డామినల్ మజిల్స్‌ను యాక్టివేట్ చేసేందుకు లెగ్ రైజ్ చేయాలి. అంటే వెల్లకిలా పడుకుని కాళ్లను ఒక అడుగు ఎత్తు వరకు లేపి ముప్ఫై సెకన్ల పాటు ఉంచాలి. ఇలా పది సెట్లు చేయొచ్చు.
సిక్స్ ప్యాక్ కోసం చేయాల్సిన మరో ముఖ్యమైన వర్కవుట్ ప్లాంక్. బోర్లా పడుకుని చేతులపై శరీరాన్ని పైకి లేపి అదే పొజిషన్‌లో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఇది కోర్ మజిల్స్‌ను యాక్టివేట్ చేస్తుంది.
ఇక వీటితో పాటు పుషప్స్, పులప్స్, రష్యన్ ట్విస్ట్స్, మౌంటెన్ క్లైంబర్స్ వంటివి కూడా కలిపి చేస్తే త్వరగా సిక్స్ ప్యాక్ మజిల్స్ షేప్ అవుతాయి.