దిండు వాడడం మంచిదేనా? మెడనొప్పికి దిండుతో లింకేంటి?
తలకింద మందపాటి దిండు లేనిదే నిద్రపట్టదు చాలామందికి. అయితే ఈ రోజుల్లో కామన్‌గా వస్తున్న మెడ నొప్పి, తిమ్మిర్ల వంటి సమస్యలకు దిండు కారణమవుతోందని డాక్టర్లు చెప్తున్నారు.
తలకింద మందపాటి దిండు లేనిదే నిద్రపట్టదు చాలామందికి. అయితే ఈ రోజుల్లో కామన్‌గా వస్తున్న మెడ నొప్పి, తిమ్మిర్ల వంటి సమస్యలకు దిండు కారణమవుతోందని డాక్టర్లు చెప్తున్నారు. అసలు దిండు ఎలా ఉండాలి? దిండుతో ఉన్న ప్రమాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హాయిగా నిద్రపట్టాలంటే తలకింద ఎత్తు ఉండాలి. ఇది చాలామందికి అలవాటు. అయితే మరీ ఒత్తయిన దిండు వాడడం లేదా రెండు మూడు దిండ్లు కలిపి తలకింద పెట్టుకోవడం అలాగే పగటిపూట తలకింద దిండు పెట్టుకుని అదే పనిగా ఫోన్ చూడడం వల్ల చాలామందిలో వెన్నెముక సమస్యలొస్తున్నాయి.
నష్టాలివే..
మందపాటి దిండ్లను ఎక్కువ కాలం పాటు ఉపయోగించడం వల్ల మెడ ముందుకి వంగిపోతుంది. రాత్రంగా అదే పోజిషన్ లో ఉండడం వల్ల మెడ దగ్గరి డిస్క్‌లు ప్రమాదంలో పడతాయి. తద్వారా మెడ, భుజం నొప్పులు మొదలవుతాయి.
ఎత్తయిన దిండు పెట్టుకొని పడుకోవడం వల్ల తలకి రక్త సరఫరా తగ్గి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తిమ్మిర్లు, జుట్టు రాలడం వంటి సమస్యలు మొదలవుతాయి.
దిండుకి కవర్లు వాడకపోవడం, ఒకటే దిండుని ఎక్కువకాలం పాటు వాడడం వల్ల దిండ్లపై దుమ్ము కణాలు పేరుకుంటాయి. ఇవి మొటిమలకు, అలర్జీలకు కారణమవుతాయి.
పగటిపూట ఎత్తయిన దిండుపై పడుకుని అదేపనిగా ఫోన్ చూడడం వల్ల వెన్నెముక పోశ్చర్ దెబ్బ తింటుంది. దానివల్ల వెన్నునొప్పి, మెడనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.
దిండు ఇలా ఉండాలి
మంచి నిద్ర కోసం దిండు వాడాల్సిందే. అయితే దిండు సన్నగా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. మెమరీ ఫోమ్, మెత్తటి స్పాంజ్‌తో చేసిన దిండ్లు వాడొచ్చు.
దిండు ఎత్తు నాలుగు ఇంచ్‌లకు మించకూడదు. వీలైనంతవరకూ పలుచని దిండు వాడాలి. అలాగే దిండుకి కవర్లు వాడుతూ వాటిని తరచూ మారుస్తుండాలి.
వెల్లకిలా పడుకునేవాళ్లు తప్పకుండా తేలికపాటి దిండు వాడాలి. మెడనొప్పి, వెన్నునొప్పితో బాధపడేవాళ్లు కొన్ని రోజుల పాటు దిండు లేకుండా పడుకోవడం బెటర్.