దిగులు, మానసిక ఆందోళనతో బాధపడుతున్నారా? వీటికి ఈ లోపాలే కారణం!
ఆయుర్వేదం కూడా మానసిక ఆందోళనకు బీ12, ఐరన్ లోపం కారణమని చెబుతోంది.
చదువు, ఉద్యోగం, కుటుంట బాధ్యతల ఒత్తిడో.. మరో కారణమో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల బారిన పడే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. యువకులు, మధ్య వయస్కుల వారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏవైనా సమస్యల కారణంగా ఇలాంటి దిగులు, ఆందోళన ఎక్కువగా ఉంటుందని చాలా మంది పొరబడుతుంటారు. అలా బాధపడే వారికి ఎక్కువగా ఆలోచించ వద్దని చెబుతుంటారు. కానీ వీటికి పోషకాహార లోపం కూడా కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో ఐరన్, బీ12 లోపాల వల్ల మానసిక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండు పోషకాలు శరీరంలో రక్తం వృద్ధి చెందడానికి, మెరుగైన పని తీరుకు సహకరిస్తాయి. రక్తం తగ్గడం వల్ల వచ్చే అనేక వ్యాధులను ఈ రెండు పోషకాలు నివారిస్తాయి. విటమిన్ బీ12 ఎర్ర రక్త కణాలను, డీఎన్ఏను ఏర్పరిచే ముఖ్యమైన పోషకం. ఇక ఐరన్.. మన శరీర భాగాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్లే పోషకం. ఈ రెండు లోపిస్తే ఆ ప్రభావం స్త్రీలల్లో ముందుగా కనిపిస్తుంది. వారి మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటివి ఎక్కువై పోతాయి.
ఐరన్, కోబాలమిన్ (బీ12) లోపానికి, మానసిక ఆరోగ్యానికి ఏం సంబంధం ఉందని అనేక అధ్యయనాలు జరిగాయి. ఐరల్ లోపం వల్ల డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయిన పలు పరిశోధనలు ఇప్పటికే నిరూపించాయి. ఐరల్ లోపం వల్ల న్యూరోట్రాన్స్ మీటర్, మూడ్ స్టెబిలైజర్‌గా పని చేసే సెరోటోనిన్ తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల విచారంగా ఉండటం, శ్వాస సరిగా ఆడకపోవడం, కండరాల బలహీనత, మానసిక, శారీరిక అలసట కలుగుతుంది. అందుకే మూడు నెలలకు ఒకసారైనా ఐరన్, బీ12 లెవెల్స్‌ను పరీక్షించుకోవాలి. ఇతర ఖనిజాల లోపం ఏమైనా ఉందేమోనని చెక్ చేసుకోవాలి.
ఆయుర్వేదం కూడా మానసిక ఆందోళనకు బీ12, ఐరన్ లోపం కారణమని చెబుతోంది. మానసిక ప్రవర్తనలను ప్రభావితం చేసే మెదడు పని తీరుకు ఐరన్ చాలా అవసరం అని అంటోంది. ఐరన్ తగ్గుదల వల్ల ఆందోళన, నిరాశ పెరుగుతాయి. రక్త హీనత శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఐరన్, బీ12 లోపం రాకుండా ఉండాలంటే మన సరైన పోషకాహారం తీసుకోవాలి. మన ఆహారంలో ఆకు కూరలు, నట్స్, చేపలు, చికెన్, గుడ్లు, బీన్స్, బఠానీలు, పప్పులు, ఓట్స్, చీజ్ ఉండేలా చూసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తే వీటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి.. ట్యాబ్లెట్లు కూడా ఇస్తారు. ఈ రెండు పోషకాలు మన శరీరంలో తగ్గకుండా చూసుకుంటే డిప్రెషన్, స్ట్రెస్ నుంచి కాపాడుకోవచ్చు.