షుగర్ పేషంట్లు రోజూ ఎంత నడవాలంటే?
వారంలో కనీసం ఐదు రోజులు రోజుకు 30 నిమిషాలు నడిస్తే మంచిదని సూచిస్తున్న నిపుణులు
షుగర్ ఉన్నవాళ్లు ఎంత నడిస్తే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ ఉన్నవాళ్లకు వాకింగ్ ఉత్తమమైన వ్యాయామం అంటున్నారు. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే ఎంత సేపు నడవాలో నిపుణులు వివరిస్తున్నారు. వారంలో కనీసం ఐదు రోజులు రోజుకు 30 నిమిషాలు నడిస్తే మంచిదని సూచిస్తున్నారు.
వాకింగ్ మొదలుపెడదామని అనుకుంటే భోజనం తర్వాత తేలికగా జీర్ణమయ్యేందుకు పది నిమిషాల షార్ట్ వాక్‌తో ప్రారంభించవచ్చు అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్ అనంతరం కనీసం పది నుంచి 15 నిమిషాలు నడిస్తే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయంటున్నారు. ఒకవేళ రోజులో ఒకేసారి అరగంట నడవలేకపోతే.. దాన్ని డివైడ్ చేసుకుని వాకింగ్ చేసినప్పుడల్లా 10 నిమిషాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడిస్తే ఇన్సులిన్ స్థాయిలు పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయంటున్నారు.
కనీసం 5 వేల అడుగులు వేయడానికి యత్నించాలి. ఆ తర్వాత వాటిని 7 వేల నుంచి 10 వేలకు పెంచితే అనారోగ్యాలు దరి చేరకుండా ఉంటాయని తెలుపుతున్నారు. ముందుగా కీళ్లపై ఒత్తిడి పడకుండా సమాంతరంగా ఉన్న నేలపై నడవాలి. తర్వాత రాళ్లలోనూ, మెట్లపై ఎక్కి, దిగుతూ ఉండాలంటున్నారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు పొద్దున, సాయంత్రం వాకింగ్‌కు టైం కేటాయించాలంటున్నారు.