వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు ఇలా..
వడదెబ్బ తగిలినప్పుడు నీరసంగా అనిపిస్తుంది. మెదడులో గందరగోళం, చిరాకు వంటివి పెరుగుతాయి. తలనొప్పి, మైకం వంటివి కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో మూర్ఛ వచ్చి పడిపోవచ్చు.
మే నెల వచ్చేసింది. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైన పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండే ఈ ఎండలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా మే నెలలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
సమ్మర్ సీజన్‌లో భయపడాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది వడదెబ్బ మాత్రమే. ముఖ్యంగా బయటకు వెళ్లేవాళ్లు సన్ స్ట్రోక్ బారిన పడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగని ఇంట్లో ఉంటే సేఫ్ అని కాదు. ఉక్కపోతగా ఉన్న ప్రతిచోటా అప్రమత్తంగా ఉండడం అవసరం.
వడదెబ్బ లేదా సన్ స్ట్రోక్ అనేది ప్రాణాపాయ పరిస్థితిని క్రియేట్ చేయగలదు. కాబట్టి పీక్ సమ్మర్ టైంలో వడదెబ్బ పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం. ముందుగా వీలైనంతవరకూ డైరెక్ట్ సన్‌లైట్‌కు ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలి. వాటర్ బాటిల్‌తో పాటు వెంట నిమ్మరసం, ఓఆర్‌ఎస్ వంటివి కూడా క్యారీ చేయాలి.
బయటి వాతావరణం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వెదర్ అప్‌డేట్స్‌ను ఫాలో అవుతుండాలి. టెంపరేచర్లు పెరిగే రోజుల్లో, వడగాలులు వీచే రోజుల్లో బయటి ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఇంట్లో కూడా ఉక్కపోత లేకుండా కూలర్ల వంటివి ఏర్పాటు చేసుకుంటే మంచిది. తెల్లటి వస్త్రాలు ధరించడం వదులైన బట్టలు వేసుకోవడం కూడా కొంత హెల్ప్ చేస్తుంది.
అన్నింటికంటే ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో రోజుకి నాలుగైదు లీటర్ల నీటితోపాటు రోజూ నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగడం, పుచ్చకాయ, తర్భూజా వంటి పండ్లు తినడం మరింత మేలు చేస్తుంది.
వడదెబ్బ తగిలినప్పుడు నీరసంగా అనిపిస్తుంది. మెదడులో గందరగోళం, చిరాకు వంటివి పెరుగుతాయి. తలనొప్పి, మైకం వంటివి కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో మూర్ఛ వచ్చి పడిపోవచ్చు. అలాగే మరికొంతమందికి వికారం, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
బయట లేదా ఇంట్లో ఎవరికైనా వడదెబ్బ తగిలినట్టు గుర్తిస్తే.. వెంటనే ఆ వ్యక్తిని నీడలోకి తీసుకెళ్లాలి. చల్లని నీటిలో ముంచిన గుడ్డతో ఒంటిని తుడవాలి. చల్ల గాలి తగిలేలా చూడాలి. నీటిని తాగించడానికి బదులు ఉప్పు కలిపి మజ్జిగ లేదా ఓఆర్‌ఎస్ ద్రావణం పట్టిస్తే మరింత రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత లేట్ చేయకుండా కారు లేదా ఆటోలో డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.