పొట్ట క్యాన్సర్ పెరుగుతోంది! జాగ్రత్తలు ఇలా..
పొట్ట క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా వస్తుంటుంది. ముఖ్యంగా యాభై ఏళ్లు పైబడినవాళ్లలో ఎక్కువ. ఈ క్యాన్సర్‌ను మొదటిదశలో గుర్తిస్తే ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అయితే మనదేశంలో ఎక్కువగా వస్తున్న క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ల తర్వాత గ్యాస్ట్రిక్ లేదా స్టమక్ క్యాన్సర్ ఐదో ప్లేస్‌లో ఉంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా.. పొట్ట క్యాన్సర్ లక్షణాలు, జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
పొట్ట క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా వస్తుంటుంది. ముఖ్యంగా యాభై ఏళ్లు పైబడినవాళ్లలో ఎక్కువ. ఈ క్యాన్సర్‌ను మొదటిదశలో గుర్తిస్తే ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుంది. నిల్వ ఉన్న ఆహారాలు తినడం, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి ఈ ప్రమాదానికి కారణాలుగా ఉంటున్నాయి.
లక్షణాలు ఇవీ..
పొట్టలో క్యాన్సర్ ఉన్నప్పుడు కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. తరచూ వాంతులు అవ్వడం, వాంతిలో రక్తం పడడం, పొత్తికడుపు నొప్పి, పచ్చ కామెర్లు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించొచ్చు.
గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలను మొదట్లోనే గుర్తిస్తే.. క్యాన్సర్‌ను నయం చేయొచ్చు. వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య పూర్తిగా తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌లో పొట్టలో కణితి ఏర్పడుతుంది. లేట్ చేసే కొద్దీ తొలగించలేనంతగా పెరిగిపోతుంది. ఎర్లీ స్టేజ్‌లో దాన్ని గుర్తిస్తే.. ఆపరేషన్ చేసి తొలగించొచ్చు. పొట్ట క్యాన్సర్‌కు కీమో థెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి.
జాగ్రత్తలు ఇలా..
గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు తాజా ఆహారం తినడాన్ని అలవాటు చేసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారం, బేక్డ్ ఫుడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వండిన పదార్ధాలను మళ్లీ వేడి చేసి తినే అలవాటు మానుకోవాలి. దీర్ఘకాలిక స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి కూడా క్యాన్సర్ కణాలను ప్రేరేపిస్తాయి. కనుక అలాంటి అలవాట్లు మానేయాలి. వయసుపైబడే కొద్దీ పండ్లు, కాయగూరలు వంటివి తీసుకుంటూ వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకుంటే పొట్ట క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడొచ్చు.