చర్మాన్ని బట్టి ఫేస్‌వాష్ ఇలా..

మొటిమలు, మచ్చలు, జిడ్డు లాంటి సమస్యలను కేవలం ఫేస్‌వాష్‌తోనే తగ్గించుకోవచ్చు. అయితే ఆ ఫేస్‌వాష్ అనేది చర్మం రకాన్ని బట్టి ఎంచుకోవాలి. ఫేస్‌వాష్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మాన్ని అందంగా మలచుకోవచ్చు.

Advertisement
Update:2022-12-31 21:03 IST

చర్మాన్ని బట్టి ఫేస్‌వాష్ ఇలా..

మొటిమలు, మచ్చలు, జిడ్డు లాంటి సమస్యలను కేవలం ఫేస్‌వాష్‌తోనే తగ్గించుకోవచ్చు. అయితే ఆ ఫేస్‌వాష్ అనేది చర్మం రకాన్ని బట్టి ఎంచుకోవాలి. ఫేస్‌వాష్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మాన్ని అందంగా మలచుకోవచ్చు.

జిడ్డు చర్మం, పొడిచర్మం, ముదురు చర్మం ఇలా రకరకాల చర్మాల ఉంటాయి. ఒక్కో రకమైన చర్మానికి ఒక్కోరకమైన ఫేస్‌వాష్ సూట్ అవుతుంది. చర్మ రకాన్ని బట్టి సహజమైన ఫేస్‌వాష్‌లు కూడా ట్రై చేయొచ్చు. ఎలాంటి చర్మానికి ఎలాంటి ఫేస్‌వాష్‌లు సూట్ అవుతాయంటే..

ముందుగా పొడిచర్మం ఉన్నవాళ్లు ఆల్కహాల్‌, పారాబెన్‌.. వంటి రసాయనాలు లేని ఫేస్‌వాష్‌లను ఎంచుకోవాలి. లేదా పెరుగులో తేనె లేదా గుడ్డు సొన కలిపి ఫేస్‌వాష్ చేసుకోవచ్చు. అలాగే పాలు, తేనెతో కూడా ముఖాన్ని కడుక్కోవచ్చు. చర్మం బాగా పొడిబారుతున్నవాళ్లు రాత్రిళ్లు ముఖానికి నూనె రాసి మర్దన చేసి, కాసేపటి తర్వాత కడిగేయాలి.

ఇక జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ఎన్ని సార్లు ఫేస్‌వాష్ చేసినా ముఖం జిడ్డుగానే కనిపిస్తుంది. దానివల్ల మొటిమలు, మచ్చలు కూడా వస్తుంటాయి. ఇలాంటి వాళ్లు నురుగు వచ్చేలా సబ్బుతో ఫేస్‌వాష్ చేసుకోవచ్చు. అలాగే రోజ్‌వాటర్‌, యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, పాలు వంటి వాటితో ఫేస్‌వాష్ చేసుకోవచ్చు. తేనె, నిమ్మరసం లేదా కీరా, టొమాటో రసంతో కూడా ముఖాన్ని కడుక్కోవచ్చు. జిడ్డు చర్మం ఉన్న వాళ్లు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.

ఇకపోతే కొంతమందికి ముక్కు, నుదురు పైన జిడ్డుగా మిగతా చోట పొడిగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు ఫేస్‌స్క్రబ్‌ బాగా ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, బొప్పాయి, శెనగపిండి.. వంటి పదార్థాలతో తయారుచేసిన స్క్రబ్స్‌ కూడా వాడొచ్చు. రోజ్‌వాటర్‌, కలబంద గుజ్జుతో ఫేస్‌వాష్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.

చర్మతత్వం ఎలాంటిదైనా ఫేస్‌వాష్ చేసుకోవడానికి గోరువెచ్చని నీళ్లు లేదా చల్లటి నీళ్లను మాత్రమే ఉపయోగించాలి. ముఖం కడుక్కున్న తర్వాత టవల్‌తో ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. మృదువైన టవల్‌తో నెమ్మదిగా అద్దుతూ తుడుచుకోవాలి.

మార్కెట్లో దొరికే ఫేస్‌వాష్‌లను కొద్ది మొత్తంలో వాడడమే మంచిది. ముఖం కడుక్కున్నాక చర్మం పొడిబారిపోకుండా, తాజాగా ఉండాలంటే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. వీటితో పాటు తాజా పండ్లు, కూరగాయలు తినాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.

Tags:    
Advertisement

Similar News