సౌండ్ డైటింగ్ చేస్తున్నారా?

80 డెసిబెల్స్ తీవ్రతతో ఉన్న శబ్దాన్ని 30 నిమిషాల పాటు వింటే మన వినికిడి శక్తి దాదాపు పాడవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Update:2022-07-30 14:49 IST

చేతిలో మొబైల్, చెవుల్లో హెడ్ ఫోన్స్ లేకుండా కనిపించేవాళ్లు ఈ రోజుల్లో చాలా తక్కువ. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ చెవులు శబ్దాలను వింటూనే ఉంటాయి. దీనివల్ల చెవిలో ఉండే సున్నితమైన కణాలు దెబ్బతింటాయంటున్నారు డాక్టర్లు. హెడ్ ఫోన్స్ వాడకం మరీ ఎక్కువైతే వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే అప్పుడప్పుడు సౌండ్ డైటింగ్ చేస్తూ సమస్యను తీవ్రతరం కాకుండా చూసుకోవాలి.

సౌండ్ డైటింగ్ అంటే చెవులకు ప్రమాదం కలిగించే శబ్దాల నుంచి దూరంగా ఉండడం. శబ్ద తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే మన చెవులకు అవి అంత ప్రమాదం. మనం వినే శబ్దం ఎంత తీవ్రతతో ఉంది? ఆ శబ్దాన్ని మనం ఎంతసేపు వింటున్నాం అనే విషయాలను గ్రహించి.. కంట్రోల్‌లో ఉంచుకోవాలి. 80 డెసిబెల్స్ తీవ్రతతో ఉన్న శబ్దాన్ని 30 నిమిషాల పాటు వింటే మన వినికిడి శక్తి దాదాపు పాడవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

♦ వినికిడి సమస్యలను నివారించేందుకు గ్యాడ్జెట్లలో మ్యూజిక్ వినేటప్పుడు తక్కువ సౌండ్‌తో వినడం అలవాటు చేసుకోవాలి. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కూడా తక్కువ వాల్యూమ్‌లో వినాలి.

మొబైల్‌లో మ్యూజిక్ వినేటప్పుడు వాల్యూమ్ 60 పెట్టి వినాలి. అది కూడా 60 నిమిషాల పాటు మాత్రమే వినాలి. దీన్నే 60-60 రూల్ అంటారు. సౌండ్ డైటింగ్‌లో ఇది ముఖ్యమైన రూల్.

ఇకపోతే రోజూ చెవులకు కొద్దిసేపు విశ్రాంతి ఇవ్వడం అవసరం. ప్రైవేట్ పార్టీలు, కన్సర్ట్స్‌కి వెళ్లినప్పుడు స్పీకర్స్‌లో మ్యూజిక్ వినాల్సి వచ్చినప్పుడు చెవుల్లో ప్లగ్స్ లేదా కాటన్ లాంటివి వాడాలి.

కారులో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటుంటారు చాలామంది. కానీ అక్కడ కూడా 60-60 రూల్ పాటిస్తే ఇబ్బంది ఉండదు.

ఏదేమైనా రోజుంతా చెవులకు పని చెప్పకుండా చెవులకు కాస్త విశ్రాంతినివ్వడమే సౌండ్ డైటింగ్. వినే శబ్దాలు, వింటున్న సమయాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఎలాంటి వినికిడి సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

Tags:    
Advertisement

Similar News