ఉదయం లేవగానే తలనొప్పిగా ఉందా? ఇలా చేయండి..

ఉదయం నిద్రలేవగానే తలనొప్పికి డీహైడ్రేషన్‌ ఒక కారణంగా చెప్పొచ్చు.

Advertisement
Update:2024-01-16 12:15 IST

శీతాకాలంలో తలనొప్పి చాలా సాధారణం. ఎంతగా అంటే మనలో చాలా మందికి తలనొప్పి సమస్య ఎప్పుడో ఒకసారి వేధిస్తూనే ఉంటుంది. అయితే కొందరికి మాత్రం మార్నింగ్ లేవగానే తలనొప్పి ఉంటుంది. అది కూడా తల బద్దలయ్యేంత నొప్పి. ఉదయాన్నే తలనొప్పితో నిద్రలేవడం వల్ల మనకు అసౌకర్యంగా అనిపించడంతోపాటు మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. అయితే తలనొప్పికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి.

ఉదయం నిద్రలేవగానే తలనొప్పికి డీహైడ్రేషన్‌ ఒక కారణంగా చెప్పొచ్చు. రాత్రిపూట సరిపడ నీరు తాగకుండా నిద్రపోతే ఇలాంటి సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్ర నాణ్యత లేకపోవడం, ఒత్తిడి కూడా ఇందుకు కారణం కావచ్చు. వారం వారం షిఫ్ట్ మార్చి పనిచేసే వారిలో ఇలాంటి తలనొప్పి సాధారణమే. ఎందుకంటే మీ బాడీ క్లాక్ ఒక విధంగా సెట్ అయ్యి ఉంటుంది. అందుకు భిన్నంగా మీ నిద్రపొయ్యే పాటర్న్ ఉన్నపుడు ఇలాజరుగుతుంది.

స్లీప్‌ అప్నియాతో బాధపడేవారిలో కూడా తలనొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కునే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే గురకతో ఇబ్బందిపడే వారిలో కూడా తలనొప్పి వస్తుందని చెబుతున్నారు.

అయితే ఇటువంటి తలనొప్పి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది దాదాపు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వచ్చే నొప్పికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. పొద్దున్న లేచిన వెంటనే గ్లాసుడు మంచి నీళ్ళు తాగడం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

అలాగే ఈ సమస్య ఉన్నవారు రాత్రి వేళ కెఫిన్ ఉన్న టీ, కాఫీ, చాక్లెట్లు వంటివి కాకుండా ఒక గ్లాసు నీరు తాగి పడుకోండి. రాత్రంతా టీవీలు, మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లు చూసి నిద్రించే అలవాటును తగ్గించుకోవాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చెయ్యాలి. అలాగే ఆల్కహాల్ పరిమితికి మించి తీసుకోకూడదు.

అయితే తలనొప్పితో పాటూ వికారం, వాంతులు, తల తిరగడం, దృష్టిలోపం వంటి ఇతర ఇబ్బందికరమైన లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Tags:    
Advertisement

Similar News