మధుమేహం ఉంటే తలనొప్పి వస్తుందా?

డయాబెటిస్ ఉన్నవారిలో అతిదాహం, ఎక్కువసార్లు యూరిన్ కి వెళ్లటం, గందరగోళం, అలసట, బరువు తగ్గటం, ఆకలి పెరగటం, చూపు మసకబారటం, గాయాలు త్వరగా మానకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి.

Advertisement
Update:2023-06-17 13:00 IST

డయాబెటిస్ ఉన్నవారిలో అతిదాహం, ఎక్కువసార్లు యూరిన్ కి వెళ్లటం, గందరగోళం, అలసట, బరువు తగ్గటం, ఆకలి పెరగటం, చూపు మసకబారటం, గాయాలు త్వరగా మానకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే మధుమేహుల్లో తలనొప్పి కూడా ఉంటుందని, తరచుగా తలనొప్పి వస్తుంటే రక్తంలో చెక్కర స్థాయిలో తేడాలు వస్తున్నట్టుగా భావించాలని వైద్యులు అంటున్నారు. ఈ అంశం గురించి వివరంగా తెలుసుకుందాం-

సాధారణంగా మనకు చాలా సందర్భాల్లో, రకరకాల కారణాల వలన తలనొప్పి వస్తుంటుంది. టెన్షన్లు, పనిఒత్తిడి కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. జ్వరంలాగానే తలనొప్పికి అసలైన కారణమేంటి అనేది చెప్పలేము. అయితే మధుమేహం ఉన్నవారికి తలనొప్పి వస్తుంటే వారికి రక్తంలో చెక్కర స్థాయి ఒక్కసారిగా పెరగటం, లేదా తగ్గటం జరుగుతుండే అవకాశం ఉంది. చెక్కర స్థాయిలో మార్పులు వచ్చినప్పుడు కొన్నిరకాల హార్మోన్ల స్థాయిలో కూడా తేడా వస్తుంది. ఆ కారణంగానే తలనొప్పి వస్తుంది.

రక్తంలో చెక్కరస్థాయి పెరిగినప్పుడు ...

ఈ పరిస్థితిని హైపర్ గ్లైసీమియా అంటారు. ఇలాంటప్పుడు మన శరీరం ... ఎక్కువైన గ్లూకోజ్ ని బయటకు పంపడానికి మూత్రం ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. దీనివలన శరీరంలో డీహైడ్రేషన్, వాపు మంట లక్షణాలతో కూడిన ఇన్ ఫ్లమేషన్ మొదలవుతాయి. దాంతో మెదడులోని రక్తనాళాలు సంకోచించి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చెక్కరస్థాయి తగ్గిపోతే...

ఈ పరిస్థితిని హైపోగ్లైసీమియా అంటారు. ఈ స్థితిలో మెదడుకి గ్లూకోజ్ అందకపోవటం వలన తలనొప్పి వస్తుంది. సాధారణంగా హైపోగ్లైసీమియా వల్ల వచ్చే తలనొప్పి ఉదయాన్నే వస్తుంటుంది.

మధుమేహం వలన వచ్చే తలనొప్పికి చికిత్స ...

షుగర్ ఉండి తలనొప్పులకు గురవుతున్నవారు తప్పకుండా రక్తంలో చెక్కర స్థాయి అదుపులో ఉండేలా చూసుకోవాలి, అలాగే తలనొప్పి తరచుగా వస్తుంటే వైద్యులను సంప్రదించాలి. మధుమేహంతో పాటు కంటి చూపు తగ్గటం, ఆందోళన, అలసట, సైనస్ వంటి అనేక కారణాలు తలనొప్పుల వెనుక ఉంటాయి కనుక వైద్యులు పరీక్షించి మందులు ఇస్తారు. మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయటం ద్వారా మధుమేహం కారణంగా వచ్చే సమస్యలను నివారించుకునే అవకాశం ఉంటుంది. రక్తంలో చెక్కర పెరగటం వలన తలనొప్పికి గురవుతున్నవారు దానిని నివారించాలంటే తగినంత వ్యాయామం చేయాలి. అలాగే ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.

Tags:    
Advertisement

Similar News