మానవాళిని కబళిస్తోన్న డయాబెటిస్
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కారణంగా చాలా మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. డయాబెటిస్ ద్వారా కిడ్నీలు పాడయిన వారికి.. డయాలసిస్ చేసినా తాత్కాలిక ఉపశమనమే కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
మారుతున్న జీవన శైలి, తీసుకునే ఆహారం, ఇతర కారణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ (షుగర్) రోగులు పెరిగిపోతున్నారు. ఇండియాలో ప్రతీ ఏడుగురిలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నేషనల్ మెడిసిన్ ఆఫ్ లైబ్రరీ ప్రకారం ఇండియాలో 2019 నాటికి 7.7 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 2045 నాటికి వీళ్ల సంఖ్య 13.4 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో చాలా మంది టైప్-2 డయాబెటిస్ రోగులు ఇంకా పరీక్షలు కూడా చేయించుకోని ఉండరని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఒక రకంగా ఈ వ్యాధి మానవాళిని కబళిస్తోందని.. దీని కారణంగానే శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతింటున్నట్లు చెబుతున్నారు.
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కారణంగా చాలా మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. డయాబెటిస్ ద్వారా కిడ్నీలు పాడయిన వారికి.. డయాలసిస్ చేసినా తాత్కాలిక ఉపశమనమే కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసుకుంటూ, సరైన వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. నియంత్రణ లేని డయాబెటిస్ కారణంగా కిడ్నీలో రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది కిడ్నీలపై భారం కలిగించి, అంతిమంగా అవి పాడవడానికి కారణం అవుతాయి. డయాబెటిస్ ఉన్న వాళ్లు కనీసం ఏడాదికి ఒక సారి క్రియాటిన్ టెస్టు, అబ్బుమిన్ లెవెల్స్ టెస్ట్ చేయించుకోవాలి.
అలాగే డయాబెటిస్ ఉన్న వాళ్లు ఏ ఆహారం తీసుకోవాలనే విషయంపై చాలా అపోహలు కూడా ఉన్నాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్లు అరటి పండ్లు తినకూడదని, ఆపిల్స్ తినొచ్చనే అపోహ ఉన్నది. కాగా, అన్ని రకాల పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. కానీ ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను మాత్రం పెంచదు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. అరటి పండ్లను తీసుకోవడం వల్ల ప్రమాదం ఏమీ లేదు. ఇందులో ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. హై బీపీని నివారిస్తుంది.
చాలా మంది కాఫీ, టీలలో చక్కెర వేసుకోవడానికి భయపడుతుంటారు. కానీ, బిస్కెట్లు తింటుంటారు. అయితే మధుమేహం ఉన్న వాళ్లు బిస్కెట్లు తినడం మానేయాలి. రోజుకు రెండు కప్పుల కాఫీ లేదా టీని చక్కెరతో తీసుకోవడం వల్ల ప్రమాదం లేదు. వాస్తవానికి బిస్కెట్లలో ఉండే మైదా కారణంగానే మధుమేహులకు ప్రమాదం ఎక్కువ.
ఇక నెయ్యి తినడం వల్ల ఊబకాయం వస్తుందని, శరీరంలో కొవ్వు పేరుకొని పోతుందని.. దీని కారణంగా డయాబెటిస్ ముదిరిపోతుందనే వాదన ఉన్నది. అయితే నెయ్యిని మితంగా తినడం వల్ల మధుమేహులకు మంచే జరుగుతుంది. దీనిలో ఉండే కొవ్వు ఆమ్లాలు ఇన్సులిన్‌కు మద్దతుగా నిలుస్తాయి. రోజుకు ఒక స్పూన్ నెయ్యి తినడం వల్ల గుండెకు కూడా రక్షణ ఉంటుంది.
మధుమేహం ఉన్న వాళ్లు జీవన శైలిలో పూర్తి మార్పులు చేసుకోవాలి. మితాహారం, శారీరిక వ్యాయామం తప్పనిసరి. బీపీని కూడా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. పొగాకు నమలడం, పొగ పీల్చడం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించకుండా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. మూత్రంలో ఇన్‌ఫెక్షన్ ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.