డయాబెటిస్ బాధితులకు కరివేపాకు చేసే మేలు ఏంటో తెలుసా?

డయాబెటిస్‌తో బాధపడే వాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సరైన ఆహారం తీసుకుంటూ, మందులు వేసుకోవడం వల్ల దాన్ని నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉన్నది.

Advertisement
Update:2023-02-19 18:09 IST

డయాబెటిస్ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద సమస్య. ఒకప్పుడు 45 ఏళ్లు దాటిన వారికే డయాబెటిస్ సమస్య వచ్చేది. కానీ మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా యువకుల్లో కూడా టైప్-2 డయాబెటిస్ కనపడుతున్నది. ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ప్రారంభిస్తే చాలా వరకు డయాబెటిస్ రివర్సల్ అవుతుంది. కానీ చాలా మంది డయాబెటిస్ ముదిరిన తర్వాతే అసలు విషయాన్ని గ్రహిస్తారు.

కాగా, డయాబెటిస్‌తో బాధపడే వాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సరైన ఆహారం తీసుకుంటూ, మందులు వేసుకోవడం వల్ల దాన్ని నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా తీసుకునే ఆహారమే డయాబెటిస్ హెచ్చు తగ్గుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మనం రోజూ కూరల్లో వాడే కరివేపాకు డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటానికి సహాయపడుతుంది.

కరివేపాకులో కార్బొజోల్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టడంలో సహాయపడతాయి. శరీర కణాలకు పోషణ అందించడమే కాకుండా.. టైప్ 2 డయాబెటిస్ ప్రమాద స్థాయిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగకుండా చేస్తాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. కరివేపాకులో యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయి.

కరివేపాకు వాసనను చూడటానికి చాలా మంది ఇష్టపడరు. ఇవి పచ్చిగా తినడానికి ఇబ్బంది కలిగిస్తాయి. అయినా సరే ఉదయం టీ లేదా కాఫీ తాగే ముందు కొన్ని ఆకులను నోట్లో వేసుకొని నమిలితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నేరుగా నమిలితే చేదుగా అనిపిస్తే.. ఆకులను బ్లెండర్‌లో వేసి కొద్దిగా నీరు, ఉప్పు కలిపి జ్యూస్ చేసుకొని తాగవచ్చు.

ఇక కరివేపాకు రసం కూడా చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి సహాయపడతాయి. ఒక చిన్న పాత్రలో నీళ్లు, తాజా కరివేపాకు, దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నిమిషాలు మరగబెట్టాలి. చల్లారిన తర్వాత వడగట్టి కొద్దిగా నిమ్మరసం, టీ స్పూన్ తేనె కలుపుకొని ఈ రసాన్ని తాగాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయడం మంచిదని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు.

ఇక కరివేపాకు పొడిని భోజనానికి కూర్చున్నప్పుడు మొదటి ముద్దలో కలుపుకొని తినడం కూడా మంచిదే. కూరల్లో ఈ సారి కరివేపాకు వస్తే పక్కన పెట్టకుండా.. వాటిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News