మళ్లీ కరోనా కలవరం!
యూకేలో బయటపడిన కొత్త వేరియంట్‌ను ‘ఎరిస్’గా గుర్తించారు శాస్త్రవేత్తలు. దీనికి ‘ఈజీ.5.1’ అని పేరు పెట్టారు. గతంలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ఈ వేరియంట్ వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు.
రెండేండ్ల క్రితం కరోనావైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం స్థంభించిపోయినంత పనయింది. మెల్లగా వైరస్ ప్రభావం తగ్గి ప్రస్తుతం అంతా నార్మల్ అయింది. అయితే మళ్లీ కొన్ని చోట్ల కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. తాజాగా యూకేలో వెలుగు చూసిన ఓ కొత్త వేరియంట్ మళ్లీ కలకలం రేపుతోంది.
యూకేలో బయటపడిన కొత్త వేరియంట్‌ను ‘ఎరిస్’గా గుర్తించారు శాస్త్రవేత్తలు. దీనికి ‘ఈజీ.5.1’ అని పేరు పెట్టారు. గతంలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ఈ వేరియంట్ వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు. గత నెలలోనే బయటపడ్డ ఈ ‘ఎరిస్’ వేరియెంట్.. ఇప్పుడు యూకే దేశమంతటావ్యాపిస్తోంది. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం నమోదు అవుతున్న ప్రతీ ఏడు కేసుల్లో ఒకరి ఎరిస్‌దేనని, యూకేలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న రెండో వేరియంట్ ఇదే అని తేలింది. గత వారంతో పోలిస్తే, ఈ వారంలో కేసులు మరింత పెరిగాయని రిపోర్ట్ చెప్తోంది.
దీంతో మళ్లీ కరోనా టాపిక్ వార్తల్లోకెక్కింది. యూకేలోని ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, తరచుగా చేతులు కడుక్కోవాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తోంది. ఎవరికైన శ్వాస ఇబ్బందులు, దగ్గు లాంటి లక్షణాలుంటే.. ఇతరులకు దూరంగా ఉండాలని, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తోంది. ఈ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ.. వాక్సిన్స్ ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందుతున్నప్పటికీ.. దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయొద్దని కోరింది. మిగతా దేశాల వాళ్లు కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.