మలబద్ధకంతో మెదడుకి ముప్పు..

మలబద్ధకం ఉన్నవారిలో మెదడు సామర్ధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని, సవ్యంగా ఆలోచించడం, నేర్చుకోవటం, సమస్యలను పరిష్కరించడం, నిర్ణయాలు తీసుకోవటం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మొదలైన సామర్ధ్యాలన్నీ తగ్గిపోయే అవకాశం ఉందనీ పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి.

Advertisement
Update:2023-07-23 00:37 IST

మలబద్ధకంతో మెదడుకి ముప్పు..

మలబద్ధకం అనే సమస్య పొట్టకు సంబంధించినది కదా. కానీ ఈ సమస్య మెదడు ఆరోగ్యానికి సైతం హాని చేస్తుందని పరిశోధనల్లో తేలింది. మలబద్ధకం ఉన్నవారిలో మెదడు సామర్ధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని, సవ్యంగా ఆలోచించడం, నేర్చుకోవటం, సమస్యలను పరిష్కరించడం, నిర్ణయాలు తీసుకోవటం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మొదలైన సామర్ధ్యాలన్నీ తగ్గిపోయే అవకాశం ఉందనీ పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి. ఆమ్ స్టర్ డ్యామ్ లో నిర్వహించిన అల్జీమర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో వెల్లడించిన పరిశోధన ఫలితాలను బట్టి... తీవ్రమైన మలబద్ధకం సమస్య ఉన్నపుడు సాధారణ స్థాయికన్నా 73శాతం అదనంగా మెదడు క్షీణత ఏర్పడుతుంది.

ఈ పరిశోధనకోసం 1,12,000 మందిని ఎంపిక చేసుకున్నారు. 2012-2013 మధ్యకాలంలో వీరిలో మలబద్ధకం ఏ స్థాయిలో ఉందో గమనించారు. అలాగే 2014-2017 మధ్యకాలంలో వారి మెదడు పనితీరు ఎలా ఉందో విశ్లేషించారు. ప్రతిరోజు టాయ్ లెట్ కి వెళ్లేవారితో పోలిస్తే... మలబద్దకం ఉన్నవారిలో వారి మెదడు... అసలు వయసుకంటే మూడేళ్లు పెరిగిన స్థితికి చేరుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే రోజుకి రెండుసార్ల కంటే ఎక్కువగా టాయిలెట్ కి వెళ్లేవారిలో కూడా మెదడుకి సంబంధించిన సమస్యలు ఉంటాయని అయితే మలబద్ధకంతో పోల్చినప్పుడు వీరిలో సమస్యల తీవ్రత తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.

మలబద్ధకం ఉండి మెదడు పనితీరు మందగిస్తున్నదంటే అర్థం పొట్టలో మంచి బ్యాక్టీరియా తగ్గిపోయిందని. మంచి బ్యాక్టీరియా తగ్గిపోవటం వలన పొట్టలో రోగకారకమైన బ్యాక్టీరియా పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి మలబద్ధకం ఉన్నవారిలో మంచి బ్యాక్టీరియా తక్కువగానూ చెడు బ్యాక్టీరియా ఎక్కువగానూ ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా 16శాతం మంది జనం ఈ సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. వారానికి మూడుసార్లకంటే తక్కువగా విరేచినం అవుతుంటే దానిని మలబద్ధకంగా పరగణించాలి. పెద్దవయసువారిలో మలబద్ధకం ఎక్కువగా కనబడుతుంటుంది. వ్యాయామం లేకపోవటం, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవటం, ఇతర అనారోగ్యాలకు చికిత్సగా మలబద్ధకానికి కారణమయ్యే మందులను వాడటం... ఇవన్నీ మలబద్ధకానికి దారితీస్తాయి.

ఎలా తొలగించుకోవాలి?

మలబద్దకం పోవాలంటే పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, గింజలు వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పీచుని అధికంగా పొందే అవకాశం ఉంటుంది. మంచినీరు ఎక్కువగా తాగాలి. అలాగే వ్యాయామంతోనూ, ఒత్తిడిని తగ్గించుకోవటం ద్వారానూ మలబద్దకాన్ని నివారించుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News