స్త్రీలు ఏ వయసులో బిడ్డను కంటే సురక్షితం?
హంగేరి రాజధాని బుడాపెస్ట్ లోని ఓ యూనివర్శిటీ పరిశోధకులు ఈ అంశంపై పరిశోధనలు నిర్వహించి ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చేందుకు అత్యంత సురక్షితమైన వయసు 23 నుండి 32 ఏళ్లుగా తేల్చారు.
ఈ మధ్యకాలంలో అమ్మాయిల వివాహ వయసు పెరుగుతోంది. అలాగే బాల్యవివాహాలనూ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆలస్యంగా, లేదా చిన్న వయసులోనే పిల్లలను కనటం వలన వచ్చే సమస్యలపై వైద్యులు తరచుగా హెచ్చరిస్తున్నారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్ లోని ఓ యూనివర్శిటీ పరిశోధకులు ఈ అంశంపై పరిశోధనలు నిర్వహించి ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చేందుకు అత్యంత సురక్షితమైన వయసు 23 నుండి 32 ఏళ్లుగా తేల్చారు. ఈ వయసులో బిడ్డకు జన్మనివ్వటం వలన బిడ్డకు సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.
స్త్రీ గర్భం దాల్చిన వయసుకి, జన్యుపరం కాని పుట్టుకతో వచ్చే వ్యాధులకు మధ్య ఉన్న సంబంధంపై వారు పరిశోధన నిర్వహించారు. మొదట... స్త్రీలు బిడ్డకు జన్మనిచ్చేందుకు అత్యంత సురక్షితమైన పది సంవత్సరాల కాలపరిమితిని గుర్తించడానికి తాము ప్రయత్నించామని, 23-32 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న స్త్రీలకు పుట్టే బిడ్డలకు పుట్టుకతో వచ్చే వ్యాధుల ప్రమాదం అత్యంత తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఏ వయసులో బిడ్డని కనటం ప్రమాదకరమో కూడా వారు గుర్తించారు.
తక్కువైనా... ఎక్కువైనా మంచిది కాదు...
22ఏళ్ల కంటే తక్కువ వయసున్న స్త్రీకి పుట్టిన బిడ్డలకు 20శాతం అధికంగా జన్యుపరం కాని పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు, నరాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని, 32 ఏళ్లు దాటిన స్త్రీకి జన్మిస్తే ఈ తరహా వ్యాధులు వచ్చే ప్రమాదం 15శాతం అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. 1980-2009 సంవత్సరాల మధ్యకాలంలో హంగేరిలో నాన్ క్రోమోజోమల్ డెవలప్ మెంటల్ డిజార్డర్లకు గురయిన 31,128 మంది గర్భవతులను పరిశీలించారు. నాన్ క్రోమోజోమల్ అంటే పుట్టుకతోనే వస్తాయి కానీ జన్యుపరంగా వచ్చేవి కావు. 22 ఏళ్లకంటే తక్కువ వయసున్న గర్భవతుల్లో గర్భస్థశిశివులో నరాల వ్యవస్థకు సంబంధించిన అభివృద్ధి లోపాల ప్రమాదం 25 శాతం అదనంగా ఉందని, 20 ఏళ్లలోపున్న స్త్రీలలో ఈ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉందని వారు గుర్తించారు. ఇక పుట్టుకతో బిడ్డకు వచ్చే తల మెడ చెవులు కళ్లకు సంబంధించిన డిజార్డర్ల ప్రమాదం పెద్ద వయసులో గర్భవతులైన వారిలో రెట్టింపు స్థాయిలో ఉన్నదని, 40ఏళ్లు దాటాక గర్భవతులైన వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు.
జన్యుపరంగా కాకుండా ఇతర కారణాల వలన వచ్చే నాన్-జనటిక్ బర్త్ డిజార్డర్లు సాధారణంగా గర్బవతులు ఎక్కువకాలం పాటు కలుషితమైన వాతావరణంలో ఉండటం కారణంగా వస్తుంటాయి. చిన్న వయసులో లేదా అంతగా సురక్షితం కాని పెద్ద వయసులో తల్లులయ్యేవారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గతంలో చేసిన పరిశోధనలు తల్లివయసుకి, బిడ్డకు వచ్చే డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన వ్యాధులకు సంబంధం ఉందని వెల్లడించాయి. ప్రస్తుత పరిశోధనలో బిడ్డకు జన్యుపరంగా కాకుండా వచ్చే వ్యాధులకు తల్లి వయసుకి కూడా సంబంధం ఉందని తేలింది.