జ్వరాలతో జాగ్రత్త
ఎన్‌ఎస్1 యాంటీజెన్ పరీక్ష చేస్తే డెంగీ ఉన్నదీ లేనిదీ బయటపడుతుంది. అలాగే డెంగీని త్వరగా గుర్తించటానికి ర్యాపిడ్ పరీక్షలు కూడా ఉన్నాయి.
వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో డెంగీ, మలేరియా, ఫ్లూ జ్వరాల వంటివి విజృంభిస్తుంటాయి. ఈ సీజన్‌లో వచ్చే జ్వరాలన్నీ ఒకేలా కనిపించినా అందులో ఎన్నో రకాలుంటాయి. ఏది ఎలాంటి జ్వరమో ఎలా తెలుసుకోవాలంటే..
డెంగీ
ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, విపరీతమైన తలనొప్పి, కళ్ల వెనక నొప్పి, వాంతులు, వికారం, ఒళ్లు నొప్పులు, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, ఆకలి తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తే అది డెంగీ జ్వరం అవ్వొచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎన్‌ఎస్1 యాంటీజెన్ పరీక్ష చేస్తే డెంగీ ఉన్నదీ లేనిదీ బయటపడుతుంది. అలాగే డెంగీని త్వరగా గుర్తించటానికి ర్యాపిడ్ పరీక్షలు కూడా ఉన్నాయి. డెంగీ జ్వరానికి చికిత్స తప్పకుండా తీసుకోవాలి. ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తాగుతుండాలి. ప్లేట్‌లెట్లు తగ్గుతున్నా, రక్తం చిక్కబడుతున్నట్టు కనిపిస్తున్నా ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది. డెంగీ జ్వరం ముదిరినవారికి ప్లేట్‌లెట్ల సంఖ్య తెలుసుకోవటానికి తరచూ రక్త పరీక్షలు చేస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. డెంగీ రాకుండా ఉండాలంటే దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పడుకునేటప్పుడు దోమతెరలు వాడుకోవాలి.
మలేరియా
విపరీతమైన చలి, వణుకుతో కూడిన జ్వరం వేధిస్తుంటే అది మలేరియా అవ్వొచ్చు. మలేరియా వస్తే చలి జ్వరంతో పాటు తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు కూడా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ర్యాపిడ్ డయాగ్నొస్టిస్ టెస్ట్ చేయించాలి. మలేరియాకు చికిత్స తప్పనిసరి. లక్షణాలు మొదలైన వెంటనే రక్తపరీక్ష చేయించి, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం ఉత్తమం. మలేరియా రాకుండా ఉండేందుకు దోమలు కుట్టకుండా చూసుకోవాలి. పడకగదిలో దోమతెరలు వాడుకోవాలి.
ఫ్లూ
జలుబుతో పాటు జ్వరం కూడా ఎక్కువగా ఉంటే అది ఫ్లూ జ్వరం అవ్వొచ్చు. ఇందులో శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఒళ్లునొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి కూడా ఉండొచ్చు. పొడి దగ్గు, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, అలసట, నీరసం, ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, కంటి నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. మూడు రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టకుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొందరిలో ఫ్లూ వైరస్ ఊపిరితిత్తులకూ వ్యాపించొచ్చు. కాబట్టి తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి.
టైఫాయిడ్
జ్వరమా? టైఫాయిడ్ కావొచ్చు.. అని చాలామంది అనటం చూస్తుంటాం. అంత తరచుగా వేధించే సమస్య ఇది. వానకాలంలో మరింత ఎక్కువగానూ కనిపిస్తుంటుంది. టైఫాయిడ్‌కు మూలం సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా. ఇది కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వ్యాపిస్తుంది. దీని బారినపడ్డవారు మల విసర్జన చేసినప్పుడు సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా బయటకు వస్తుంది. దీంతో కలుషితమైన ఆహార పదార్థాలు, నీరు తీసుకుంటే ఇతరులకూ సంక్రమిస్తుంది. విడవకుండా జ్వరం వస్తుంటే అది టైఫాయిడ్ అవ్వొచ్చు. ఇందులో సాధారణంగా 103 నుంచి 104 డిగ్రీల వరకూ జ్వరం ఉంటుంది. వాంతులు, విరేచనాలు, ఆకలి మందగించటం, కడుపునొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బ్లడ్, యూరిన్ టెస్ట్ చేయించాలి. టైఫాయిడ్ కు చికిత్స అవసరం. టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే అప్పుడే వండిన ఆహారం తినటం, కాచి చల్లార్చిన నీటిని తాగడం ఒక్కటే మార్గం.