భోజనానికి ముందు ఆ రెండూ తాగకండి.. ICMR స్ట్రాంగ్ వార్నింగ్

టీ, కాఫీలో కెఫీన్‌ తో పాటూ టానిన్లు కూడా ఉంటాయి. సరిగ్గా భోజనం చేసేముందు టీ , కాఫీలు తాగితే ఇందులో ఉండే టానిన్లు ఇవి మన దేహంలో ఇనుము శోషణ శక్తిని తగ్గిస్తాయి.

Advertisement
Update:2024-05-15 13:47 IST

చాయ్‌, కాఫీ..రెండింటిలో ఏదో ఒకటి పడకపోతే చాలామందికి రోజు గడవదు. అయితే మనం ఎంతో ముఖ్యంగా, ఇష్టంగా తీసుకొనే కాఫీ టీ లను మితంగా సేవించాలని, పరిమితికి మించి సేవిస్తే అనర్థాలు తప్పవని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) స్పష్టం చేసింది. మెరుగైన ఆరోగ్యం కోసం ఐసీఎంఆర్‌ 17 రకాల మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఆహార సమతుల్యత ఎంతో అవసరమని సూచించింది. భోజనానికి ముందు, తరువాత గంట వ్యవధిలో కాఫీ లేదా టీ తాగొద్దని పేర్కొంది.

 

కాఫీ, టీ లలో ఉండే కెఫీన్‌ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి టీ, కాఫీపై శారీరకంగా ఆధారపడే తత్వాన్ని పెంపొందిస్తుందని ఐసీఎంఆర్‌ పరిశోధకులు వివరించారు. మనం సేవించే ప్రతి కప్పు (150 మిల్లీలీటర్ల) బ్రూవ్డ్‌ కాఫీలో 80 నుంచి 120, ఇన్‌స్టంట్‌ కాఫీలో 50-65, టీలో 30-65 మిల్లీగ్రాముల కెఫీన్‌ ఉంటుందని పేర్కొంటూ.. రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫీన్‌ను మాత్రమే తీసుకోవాలని ఈ నివేదిక సూచించింది.

టీ, కాఫీలో కెఫీన్‌ తో పాటూ టానిన్లు కూడా ఉంటాయి. సరిగ్గా భోజనం చేసేముందు టీ , కాఫీలు తాగితే ఇందులో ఉండే టానిన్లు ఇవి మన దేహంలో ఇనుము శోషణ శక్తిని తగ్గిస్తాయి. హిమోగ్లోబిన్‌ తయారుచేసేందుకు ఐరన్‌ చాలా అవసరం.

ఇది శరీరమంతటికీ ఆక్సిజన్‌ సరఫరాలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఐరన్‌ లోపం వల్ల అలసట, నీరసం, సరిగా శ్వాస తీసుకోలేకపోవడం, తలనొప్పి, హృదయ స్పందనలో మార్పు, జుట్టు రాలడం తదితర సమస్యలతో పాటు రక్తహీనతకు దారి తీయవచ్చు.

అలాగే కాఫీని ఎక్కువగా తాగితే అధిక రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. అయితే, పాలు లేకుండా టీ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడటంతోపాటు గుండె జబ్బులు, ఉదర క్యాన్సర్‌ ముప్పు తగ్గడం లాంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. కాబట్టి పూర్తిగా కాఫీ, టీ మానలేకపోయినా వాటివల్ల మన శరీరానికి జరిగే చెడు ప్రభావాన్నిదృష్టిలోపెట్టుకుని వీటిని మితంగా తీసుకోవాలని ఐసీఎంఆర్‌ సూచించింది.

Tags:    
Advertisement

Similar News