అలసట వల్ల కలిగే హార్ట్ ఫెయిల్యూర్ నుంచి ఇలా రక్షించుకోండి..

చక్కని ఆహారం, మంచి నిద్ర, సరైన మెంటల్ హెల్త్ ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement
Update:2023-02-15 13:30 IST

హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్.. ఈ రెండు పదాల పట్ల చాలా మందికి పూర్తి అవగాహన లేదు. ఈ రెండు ఒకే కోవకు చెందినవి అని అనుకుంటారు. కానీ, వైద్య నిపుణులు ఇవి రెండు వేర్వేరు అని చెబుతున్నారు. హార్ట్ ఫెయిల్యూర్‌ను చాలా మంది హార్ట్ ఎటాక్‌గా పొరబడుతుంటారు. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయి సడెన్‌గా గుండె పని చేయడం మానేయడాన్ని హార్ట్ ఎటాక్ అంటారు. అయితే హార్ట్ ఫెయిల్యూర్ మాత్రం సడెన్‌గా వచ్చేది కాదు. మన గుండె రక్తాన్ని పంప్ చేసే లక్షణాన్ని క్రమంగా కోల్పోవడం. బలహీనమైన గుండె రక్తాన్ని అవసరమైనంత మేర పంప్ చేయకపోవడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది మన జీవన శైలి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

అసలట, నిద్రలేమి వంటి కారణాల వల్ల హార్ట్ ఫెయిల్యూర్‌కు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. మన గుండె పని చేయాల్సిన దాని కంటే ఎక్కువ సేపు పని చేయడం వల్ల కూడా క్రమంగా బలహీన పడుతుంది. ఇలా గుండె బలహీనంగా మారిపోవడం వల్ల చిన్న పనులు చేస్తేనే అలసటగా అనిపించడం, చివరకు స్నానం చేసినా సరే శరీరం నిస్సత్తువగా మారడం వంటివి జరుగుతాయి. క్రమంగా ఇది హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలియజేస్తోంది.

కాగా, ఈ హార్ట్ ఫెయిల్యూర్ నుంచి మనం తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు. మన జీవన శైలిని మార్చుకొని, మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల అలసట తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు కూడా పాటించి హార్ట్ ఫెయిల్యూర్ నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు.

1. గుండె ఆరోగ్యం కోసం ఆహారం..

మన శరీరం కోసమే కాకుండా.. గుండె ఆరోగ్యం కోసం కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, మాంసం, గింజలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే చక్కెర, కొవ్వు, ఆల్కాహాల్ పూర్తిగా తగ్గించాలి. ఈ ఆహారపు అలవాటు మన గుండెను ఆరోగ్యవంతంగా ఉంచేలా తోడ్పడుతుంది.

2. నిత్యం వ్యాయామం చేయడం..

గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒకే రోజు భారీగా ప్రారంభించకుండా ముందు ఐదు నిమిషాల నడక, చిన్న బరువులు ఎత్తడంతో మొదలు పెట్టాలి. ఆ తర్వాత 10 నిమిషాలు, 15 నిమిషాలు అంటూ పెంచుకుంటూ పోవాలి. నడకతో పాటు స్ట్రెచ్చింగ్, వార్మింగ్ అప్ ఎక్సర్‌సైజలు మనకు గుండెకు మంచిదని వైద్యులు చెబుతున్నారు.

3. పగలు కాసేపు పడుకోండి..

చాలా మంది పగటి పూట చాలా కష్టపడుతుంటారు. తెల్లారిన దగ్గర నుంచి రాత్రి వరకు పని చేస్తూనే ఉంటారు. ఇది ఫిజికల్ హెల్త్‌కు అంత మంచిది కాదని అమెరికన్ హెల్త్ అసోసియేషన్ చెబుతోంది. మధ్యాహ్నం పూట ఒక గంట సేపు చిన్న కునుకు తీస్తే గుండె ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మధ్యాహ్నం పూట మన గుండెకు కాస్త విశ్రాంతి కూడా దొరుకుతుంది. ఒకే సారి గంట సేపు పడుకోలేక పోతే అర గంట చొప్పున రెండు సార్లు పడుకుంటే.. ఆ మేరకు గుండెకు విశ్రాంతి లభిస్తుంది.

4. మెంటల్ హెల్త్ కూడా ముఖ్యమే..

చాలా మంది మెంటల్ హెల్త్ గురించి ఎక్కువగా పట్టించుకోరు. కానీ హార్ట్ ఫెయిల్యూర్స్‌కు మెంటల్ హెల్త్‌ కూడా ఒక కారణం అని వైద్యులు చెబుతున్నారు. ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటివి మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. దీని వల్ల మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. అంతిమంగా అది గుండెపై భారాన్ని పెంచుతాయి. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటే.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే అని వైద్యులు చెబుతున్నారు. ఏ విషయం గురించి అయినా ఎక్కువగా ఆలోచించకుండా.. ప్రశాంతంగా ఉండటం మన ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.

5. మంచి నిద్ర ఎంతో ముఖ్యం..

గుండె ఆరోగ్యానికి అన్నిటికంటే ముఖ్యమైనది సుఖమైన నిద్ర. రాత్రి పూట చక్కగా నిద్రపోవడం వల్ల మన బాడీ పూర్తిగా రీచార్జ్ అవుతుంది. త్వరగా పడుకొని.. త్వరగా లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి పూట బెడ్ మీదకు వెళ్లిన తర్వాత ఫోన్ చూడటం మానేయాలి. గదిలో కూడా వెలుగు తక్కువగా ఉండి, చల్లగా ఉంటే సుఖమైన నిద్ర పడుతుంది. దీంతో గుండెకు కూడా మంచి విశ్రాంతి దొరుకుతుంది.

ఈ నియమాలన్నీ పాటిస్తే మీ శరీరం అలసట నుంచి త్వరగా బయటపడుతుంది. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉండదు. చక్కని ఆహారం, మంచి నిద్ర, సరైన మెంటల్ హెల్త్ ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News