తెలంగాణలో బీజేపీకి పార్టీ లైన్‌ లేదా?

ప్రజాందోళనలపై ఒక్కో ఎంపీ ఒక్కో విధనమైన వాదన

Advertisement
Update:2024-11-12 14:32 IST

కొడంగల్‌ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్‌ సర్వీసులు, కరెంటు బంద్‌ చేసి వందలమంది పోలీసులను గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. రైతులపై అక్రమ కేసులు సరికాదన్నారు. భూసేకరణ రైతుల ఇష్ట ప్రకారం జరగాలి తప్ప.. బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.

వికారాబాద్‌ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి ప్రయత్నించింది. ఇక్కడ ఫార్మా కంపెనీలు నెలకొల్పవద్దు. మా భూములు ఇచ్చేది లేదని రైతుల మాట. మా భూములు తీసుకోకండని ప్రభుత్వానికి అనేకసార్లు మొరపెట్టుకున్నారు. అయినా ప్రభుత్వం మా విజ్ఞప్తులను పట్టించుకోకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నదని రైతులు అంటున్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ధర్నాలు కూడా నిర్వహించారని అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారని ఈటల తెలిపారు. గతంలో ముచ్చర్లలో ఫార్మా సిటీ కోసం భూములు సేకరించినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఇదే కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించిందని ఈటల గుర్తు చేశారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈటల, డీకే అరుణ వాదనలకు భిన్నంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పందించారు. దుద్యాల ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. దాడి వెనుక ఎవరున్నా సహించేది లేదన్నారు. వికారాబాద్‌ దాడి ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అంటే రైతులు భూములు తాము భూములు ఇవ్వమన్నా బలవంతంగా ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేయడాన్ని కొండా సమర్థిస్తున్నారా? అనే ప్రశ్న తెలెత్తుతున్నది. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటం అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

బీజేపీకి రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలున్నారు. హైడ్రా చర్యలు, మూసీ ప్రక్షాళన కూల్చివేతలపై ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌ రావు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ వాదనలకు భిన్నంగా స్పందిస్తారు. ఇప్పుడు ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నదని అందుకే లగచర్ల గ్రామంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారని ఈటల అన్నారు. రైతుల అరెస్టును ఆయన ఖండించారు. వాళ్ల పార్టీ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారని ఈటల చెప్పారు. రైతుల మొరను, విపక్షాల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోడంతోనే రైతులు తిరుగుబాటు చేశారని ఈటల మాటల ఆంతర్యం. కానీ పార్టీ నేతల వాదనలకు భిన్నంగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉన్నది. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులపై ఎవరు దాడులు చేసినా ఖండించాల్సిందే. వారి విధులకు ఆటంకం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. దాడికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో నిజాలు తేలుతాయి. కానీ అర్ధరాత్రి రైతులను అరెస్టు చేయడం, కరెంటు, ఇంటర్నెట్‌ సర్వీసుల బంద్‌ పెట్డడం గురించి మాట్లాడని మేడ్చల్‌ ఎంపీ రాజకీయ కుట్ర అనడం దేనికి సంకేతం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆశించిన సీట్ల కంటే తక్కువ రావడానికి కారణం ఇద్దరు ముగ్గురు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం సీఎం రేవంతే పరోక్షంగా సహకరించారనే ఆరోపణలున్నాయి. దీనిపై అప్పట్లో పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా కొండా వ్యాఖ్యలు చూస్తే అది నిజమనేలా ఉన్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Tags:    
Advertisement

Similar News