రైతుబంధుకు రాం రాం

అన్నదాతలను నిండా ముంచిన రేవంత్‌ సర్కారు

Advertisement
Update:2024-10-19 12:56 IST

''కేసీఆర్‌ ఇచ్చే రూ.10 వేలు ఏంది.. కాంగ్రెస్‌ ను గెలిపిస్తే ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తాం..'' కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రెడ్డి సహా కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన తీరు ఇది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు ముందు రైతుబంధు రైతుల ఖాతాల్లో వేయడానికి ఈసీ అనుమతి ఇచ్చినా ఫిర్యాదు చేసి అడ్డుకున్నది ఆ కాంగ్రెస్‌ పార్టీ నేతలే.. ''ఎకరానికి కేసీఆర్‌ ఇచ్చే రూ.5 వేలు తీసుకునుడు ఎందుకు.. డిసెంబర్‌ 9న ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది.. ప్రతి రైతుకు ఎకరానికి రూ.7,500 ఇస్తాం.. అని రేవంత్‌ రెడ్డి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. అవన్నీ వట్టి మాటలేనని తేలిపోయింది. రేవంత్‌ సర్కార్‌ రైతుల నోట్లో మట్టికొట్టింది. కేసీఆర్‌ ఎన్నికలకు ముందు హెచ్చరించినట్టే రైతుబంధుకు రాం రాం చెప్పేసింది. ఎన్నికలకు ముందు అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కారు రైతుబంధు కోసం పోగు చేసిన డబ్బులు ఏమయ్యాయని గట్టిగా నిలదీస్తే సాగదీసి.. సాగదీసి ఆ ఒక్క సీజన్‌ కు ఎకరానికి రూ.5 వేలు ఇచ్చిన రేవంత్‌ సర్కారు.. వానాకాలం పంట సీజన్‌ కు రైతుబంధు (రైతుభరోసా) పూర్తిగా ఎగ్గొట్టింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ఒప్పుకున్నారు. వానాకాలం సీజన్‌ కు ఏ ఒక్కరికి రైతుభరోసా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ రైతుభరోసాపై నివేదిక ఇచ్చాక.. కొత్త మార్గదర్శకాల మేరకు రైతుభరోసా సాయం ఎకరానికి రూ.7,500 చొప్పున ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పారు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాళ్లురప్పలతో కూడిన భూములు, వ్యవసాయం చేయని భూములకు రైతుబంధు ఇచ్చారని, తద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేశారని రేవంత్‌ రెడ్డి సహా కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా ఆరోపించారు. రూ.25 వేల కోట్లు కేసీఆర్‌ ప్రభుత్వం పంట సాగు చేయని రైతుల ఖాతాల్లో జమ చేసిందని ఇన్ని రోజులుగా చెప్తున్నారు. వాళ్లందరూ పంటలు సాగు చేయకపోవచ్చు కానీ రైతులు కాకుండా పోరు. ఎక్కడైనా నేషనల్‌ హైవేస్‌, రోడ్ల కోసం సేకరించిన భూములకు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు రైతుబంధు ఇచ్చి ఉంటే వాటికి సాయం నిలుపుదల చేసి మిగతా అర్హులైన రైతులందరికీ ఇచ్చి ఉండొచ్చు.. కానీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదు. రైతుభరోసాను క్రమంగా కనుమరుగు చేసే ప్రయత్నంలో భాగంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ పేరుతో ఒక పంట సీజన్‌ మొత్తం సాగదీశారు. వానాకాలం సీజన్‌ ముగిసి.. యాసంగి పంట సీజన్‌ మొదలైంది. కానీ ఇంతవరకు రైతుభరోసాపై కేబినెట్‌ సబ్‌ కమిటీ విధివిధానాలు ఖరారు చేసింది లేదు.. ఖరారు చేసిన తర్వాత వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి, సభ్యుల సలహాలు.. సూచనలు తీసుకున్న తర్వాతే రైతుభరోసా అమలు చేసేది. ఇప్పటికే కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వడానికి, పింఛన్లు పెంచడానికి డబ్బులు లేవని ప్రభుత్వ పెద్దలు చెప్పేశారు. ఇక తమకు చేతగాదు.. చేయలేము అని చెప్పాల్సిన ముచ్చట ఒక్క రైతుభరోసానే..! ఒకేసారి ఆ మాట చెప్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి రైతులు, ప్రజలు సమాధి కడుతారనే భయంతోనే కేబినెట్‌ సిఫార్సుల తర్వాత అమలు చేస్తామని బుకాయిస్తున్నరు.

వరంగల్‌ కేంద్రంగా నిర్వహించిన రైతుగర్జన బహిరంగ సభలో కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ స్వయంగా రైతులకెన్నో హామీలిచ్చారు. తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. రైతుభరోసాతో పాటు రైతు రుణమాఫీ సహా ఇతర గ్యారంటీలన్నీ అమలు చేసి తీరుతామని ఆమె హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించినప్పుడు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ప్రతి హామీ అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు, కొంత మందికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌, కొంత మందికి మాత్రమే రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌ మినహా మిగతా ఏ ఒక్క గ్యారంటీ, ఒక్క హామీ అమలు కాలేదు. రైతు రుణమాఫీ పేరుతో సీఎం, మంత్రులు చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఆ హామీ పూర్తి స్థాయిలో అమలు సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. కాంగ్రెస్‌ ను గెలిపిస్తే ఒక్కో ఎకరానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని బలంగా చెప్పిన రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు ఆ హామీని పూర్తి స్థాయిలో అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు సీజన్లకు రైతుభరోసా ఇవ్వకపోతే ఇక మూడో సీజన్‌ కు ఆ హామీ గురించి అడిగే ప్రయత్నం ఎవరూ చేయరనే రైతుభరోసాకు రాం రాం చెప్పేశారు. కాంగ్రెస్‌ హామీలను నమ్మి మోసపోయిన పాపానికి రైతులకు ఒక్కో ఎకరానికి ఏటా వచ్చే రూ.10 వేల సాయం కూడా అందకుండా పోయింది. ''నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలయినయ్‌..'' అనే సామెతను తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నూటికి నూరుపాళ్లు నిజం చేసింది.

Tags:    
Advertisement

Similar News