రాజకీయాల్లో ఈ భాషను మొదలుపెట్టింది ఎవరు?
ప్రజాప్రతినిధులు మాట్లాడే భాషనే ప్రజలు మాట్లాడుతున్నారంటున్న రాజకీయ విశ్లేషకులు;
దూషణలు, వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయ్యాక పీసీసీ అధ్యక్షుడిగా తాను వ్యవహరించినట్లు, మాట్లాడినట్లు ఇప్పుడు కుదరదని, ఇక తన నుంచి అలాంటి భాష పాత్రికేయ మిత్రులు ఆశించవద్దని రేవంత్ రెడ్డి చెప్పారు. విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నికల వరకేనని ఇప్పుడు పాలన, రాష్ట్రాభివృద్ధి గురించే తాను ఆశిస్తానని అన్నారు. ఆ మాటకు కట్టుబడి ఉంటే బాగుండేది. కానీ నిత్యం కేసీఆర్, కిషన్ రెడ్డిలపై వ్యక్తిగత విమర్శలే కాదు బూతులు మాట్లాడుతున్నదీ సీఎం రేవంత్ రెడ్డే. ఆయనను చూసే వాళ్ల పార్టీ నేతలు గాంధీ భవన్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి విపక్ష నేతలకు వార్నింగ్స్ ఇస్తున్నది తెలంగాణ ప్రజానీకం చూస్తున్నది.
దూషణలు, వ్యక్తిగత విమర్శలు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎవరు చేసినా తప్పే. దాన్ని సమాజం అంగీకరించదు. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి హుందాగా ఉంటూ ప్రజలకే అలాంటి సందేశమే పంపితే సమాజమంతా హర్షిస్తుంది. కానీ పదిహేను నెలల కాలంలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న స్ట్రెచ్చర్, మార్చూరీ మాట్లాడిందీ ఆయనే. దీన్ని తెలంగాణ సమాజమంతా ఖండించింది. సీఎం ఏమన్నారో ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. కానీ నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మళ్లీ మాట మార్చారు. తానను అనని మాటలను కేటీఆర్, హరీశ్‌రావు ఆపాదిస్తున్నారని, తనకు అంతటి కుంచిత బుద్ధి లేదన్నారు. మరి అద్దంకి దయాకర్ ప్రెస్‌మీట్‌లో హిట్లర్ ఎలా చనిపోయాడో గుర్తుపెట్టుకో కేసీఆర్ అన్న మాటలను ఎందుకు ఖండించలేదు అన్నది ఇప్పటి ప్రశ్న.
రేవంత్ రెడ్డి చూపిన మార్గంలోనే వాళ్ల ఎమ్మెల్యే వీర్ల శంకర్ కేసీఆర్ కులంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీర్లపల్లి శంకరయ్యకు షోకాజ్ నోటీస్ ఇస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు స్వయంగా ప్రకటించారు... కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వం కేంద్రంలో సఖ్యత నెరపలేదని అందుకే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాలేదు అన్నారు. కానీ తాము అలా కాదని కేంద్ర ప్రభుత్వంలో సత్సంబంధాలు కోరుకుంటున్నామన్నారు. మోడీని పెద్దన్నగా మాట్లాడారు. అయినా తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం కనికరించడం లేదని విమర్శిస్తున్నారు. మరి పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారంటే.. తెలంగాణ కోసం వందసార్లు అయినా ఢిల్లీకి వెళ్తాను అంటూ ప్రధానిని పొడుగుతూ.. కిషన్‌రెడ్డిని సైంధవుడు అంటూ తిట్ల దండకం అందుకుంటున్నారు. కేంద్రంపై వైఖరి విషయంలో, రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల వియయంలో, ప్రభుత్వం కడుతున్న అప్పుల విషయంలో ఇలా ఒక్కటేమిటీ ఏ విషయంపైనా సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టత లేదు. నిలకడ అంతకంటే లేదు.
అసెంబ్లీలో అయినా, బయట అయినా సీఎం వ్యవహారం ఎలా ఉన్నదంటే.. నేను మాట్లాడుతాను. నేను విమర్శిస్తాను. నేను తిడుతాను. మీరు పడాలి. కానీ నన్ను విమర్శించకూడదు. ప్రశ్నించకూడదు. నిలదీయకూడదు. హామీల గురించి అడుగకూడదు. ఆందోళనలు చేయకూడదు. నిరసనలు చేపట్టవద్దు. ప్రజలు తమ ఆవేదనను వెళ్లగక్కవద్ద అన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం. సీఎం భాషపైనే ఆ మధ్య టీవీ ఛానల్‌లో చర్చలో ఒక సామాజికవేత్త, ఆర్థిక నిపుణులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జనాలు బూతులు మాట్లాడుతున్నారు. నేను క్షేత్రస్థాయిలోకి వెళ్లినప్పుడు చూశాను. వాళ్లు ఏమన్నారో నేను ఇక్కడ మాట్లాడలేను అన్నారు. అంటే వారి అభిప్రాయం ముఖ్యమంత్రి భాష బాగుండాలని... ప్రజలు కూడా ఆయననే అనుసరిస్తున్నారని చెప్పకనే చెప్పారు. కాబట్టి దూషణలు, వ్యక్తిగత విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సింది ముఖ్యమంత్రే. ఆయన హుందాతనమైన రాజకీయాలు చేయాలి. అప్పడే సమాజం నుంచి కూడా కొంతమార్పు ఆశించవచ్చు.