పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
కూటమిలో విభేదాలు పరిష్కరించాల్సిన చంద్రబాబు మౌనం దేనికి సంకేతం?;
రాజకీయాల్లో ఆత్మహత్యేలే ఉంటాయి.. హత్యలు ఉండవు అంటారు. ప్రస్తుతం ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరిగ్గా సరిపోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే వైఎస్ జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుకు బీజం వేసింది పవన్ కల్యాణ్. చంద్రబాబు అరెస్టు తర్వాత జైలులో ఆయన ములాఖాత్ అయిన తర్వాత పొత్తుపై ప్రకటన చేసింది ఆయనే. పవన్ ద్వారానే బీజేపీ కూటమిలోకి ఎంటరైంది. ఇది అందరికీ తెలిసిందే.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై పీచేమూడ్ వలె కొన్నిరోజులుగా అక్కడ సూపర్ సిక్స్ అటకెక్కాయి. పదిహేను నెలలుగా పాలన చేస్తూ రాష్ట్రంలో అన్ని సమస్యలకు బీఆర్‌ఎస్సే కారణం అంటూ కాలయాపన చేస్తుంటే.. జగన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని చంద్రబాబు తన వైఫల్యాలను వైసీపీ పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
1995 నుంచి 2024 వరకు చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నడూ ఒంటరిగా పోటీ చేసిన దాఖలు లేవు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో జట్టు కట్టడం ఆయనకు మొదటి నుంచి అలవాటే. గెలిచే వరకు ఒకలా ఆ తర్వాత మరోరకంగా వ్యవహరిస్తుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్‌ను గౌరవించుకోవడానికి ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ సీట్ల విషయంలో, కార్పొరేషన్ పదవుల విషయంలో ఆపార్టీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి గురించి కూడా పార్టీ నేతలతో అడపాదడపా చెప్పిస్తున్నారు.అయితే చంద్రబాబు మార్క్ రాజకీయం ఇప్పుడు పిఠాపురంలో కనిపిస్తున్నది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు మొదటిదఫాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామన్నారు. కానీ అది జరగలేదు. తాజాగా కూడా ఆయనకు మొండి చేయిచూపెట్టి నాగబాబుకు ఆ పదవి కట్టబెట్టారు. అక్కడితో ఆగకుండా పిఠాపురంలో పవన్ గెలుపు జనసేన కార్యకర్తల కృషితోనే సాధ్యమైందని నాగబాబు అన్నారు. అంతేకాదు పవన్ కూడా టీడీపీకి లైఫ్ ఇచ్చింది తామేనని పవన్ అన్నారు.
పవన్ రాష్ట్ర నాయకుడే అయినా ఆయనను ఒక నియోజకవర్గానికే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని పసిగట్టలేని పవన్, నాగబాబులు వర్మను టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు చేస్తున్నారు. కానీ దాని వెనుక ఎవరు ఉన్నారన్నది గ్రహించడం లేదు. పవన్ గెలుపులో జన సైనికుల పాత్ర కంటే వర్మ మద్దతే కీలకం అన్నది ఆ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఎవరిని అడిగినా చెప్తారు. పదవి త్యాగం చేసిన వర్మకు రాజకీయంగా మరో అవకాశం ఇవ్వాల్సింది చంద్రబాబే. కూటమి ప్రభుత్వంలో విభేదాలకు తావులేకుండా అందరినీ స్వయనయం చేయాల్సి బాధ్యత ఆయనపైనే ఉన్నది. కానీ పిఠాపురంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతున్నాయి. తాంబులాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. వర్మ వర్సెస్ పవన్ గురించి మాట్లాడటం లేదు. మౌనం అర్ధాంగీకారం అంటారు. పిఠాపురంలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల మధ్య జరుగుతున్న పోరులో చంద్రబాబు ఎవరిని బలిచేయబోతున్నారన్నది భవిష్యత్తులో తేలుతుంది.