కూలుతుందని హెచ్చరించినా వినని రేవంత్ సర్కార్‌

అంధకారంలో ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ భవిష్యత్‌.. ఎనిమిది మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం;

Advertisement
Update:2025-03-06 12:03 IST

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్ కెనాల్‌ ప్రాజెక్టు టన్నెల్‌ కూలుతుందని కాంట్రాక్టు సంస్థ ముందే హెచ్చరించినా రేవంత్‌ సర్కార్‌ ససేమిరా అన్నది. రెడ్‌ జోన్‌ (షియర్‌ జోన్‌) లో టన్నెల్‌ తవ్వకం ఎంతో ప్రమాదకరమని హెచ్చరించినా పెడచెవిన పెట్టింది. ఫలితమే టన్నెల్‌ కూలిపోయింది. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ శిథిలాల్లో చిక్కుకుపోయి మొత్తం ప్రాజెక్టునే ప్రమాదంలోకి నెట్టేసింది. ఎనిమిది మంది ప్రాణాలను ఈ ప్రభుత్వం బలిపెట్టింది. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ ప్రమాదంపై ''ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్'' సంచలన కథనం ప్రచురించింది. ఫిబ్రవరి 22న ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ ఇన్‌లెట్‌ పాయింట్‌ నుంచి 13.85 కి.మీ వద్ద టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ పై సొరంగం పైకప్పు కూలిపోయింది. మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయి భారీ బండరాళ్లు, మట్టిపెళ్లలు పెడటంతో ఎనిమిది మంది వాటికింద చిక్కుకుపోయారు. మరో 42 మంది ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ కూలిపోయి 13 రోజులవుతున్నా గల్లంతయిన 8 మంది ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ప్రమాదం జరిగిన రోజే వాళ్లందరూ మరణించి ఉంటారనే అంచనాకు వచ్చారు. టన్నెల్‌ లో ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇంతవరకు మృతదేహాలను గుర్తించలేకపోయారు.

2020లోనే టన్నెల్‌ పనులు చేస్తోన్న కాంట్రాక్టు సంస్థ జయప్రకాశ్‌ అసోసియేట్స్‌ సొరంగం కూలిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. టన్నెల్‌ సిస్మిక్ ప్రెడిక్షన్‌ - 303 ప్లస్‌ అనే నివేదికను ఆమ్‌బర్గ్‌ టెక్‌ ఏజీ అనే సంస్థ రూపొందించింది.. దీనిని జేపీ అసోసియేట్స్‌ ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్ కు సమర్పించింది. ఈ నివదిక ప్రమాణం టన్నెల్‌ ఇన్‌లెట్‌ ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ 13.88 కి.మీ.ల నుంచి 13.91 కి.మీ.ల మధ్య రాళ్ల అమరిక బలహీనంగా ఉందని.. రాళ్ల దృఢత్వం తక్కువగా ఉందని.. నీటి ఊట అత్యధికంగా ఉందని స్పష్టం చేసింది. భూకంప తరంగాలను రాళ్ల ద్రవ్యరాశిలోకి ప్రసారం చేయడం ద్వారా టన్నెల్‌ లోని పరిస్థితులను అధ్యయనం చేసినట్టుగా ఆమ్‌బర్గ్‌ వెల్లడించింది. ఈ నివేదిక నిజమేనని.. కాని దానిపై తాము స్పందించలేమని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ వెల్లడించిందని.. ఆ నివేదిక చాలా కాన్ఫిడెన్షియల్‌ అని సర్వే చేసిన ఆమ్‌బర్గ్‌ పేర్కొన్నదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో వెల్లడించింది.

టన్నెల్‌ లో ప్రమాదకర పరిస్థితులపై జేపీ అసోసియేట్స్‌ 2020లోనే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మాజీ డైరెక్టర్‌ జనరల్‌ మందపల్లి రాజు, జేపీ అసోసియేట్స్‌ జియోలజిస్ట్‌ రితురాజ్‌ దేశ్‌ముఖ్‌ తో మరో స్టడీ చేయించింది. ''జియో టెక్నికల్‌ యాస్పెక్ట్స్‌ ఆఫ్‌ ఏ లాంగ్‌ టన్నెల్‌, డ్రైవెన్‌ బై టీబీఎం ఎట్‌ ఎస్‌ఎల్బీసీ ఆఫ్‌ ఏఎమ్మార్ ప్రాజెక్టు, తెలంగాణ స్టేట్‌ ఇండియా..'' అనే పేరుతో ఈ పరిశోధన పత్రం ప్రచురించారు. టన్నెల్‌ తవ్వుతోన్న ప్రాంతం పులుల అభయారణ్యం కావడంతో టన్నెల్‌ భూ ఉపరితలంపై ఎలాంటి పరీక్షలు చేయకుండానే సొరంగం పనులు ప్రారంభించారని ఇందులో పేర్కొన్నారు. టన్నెల్‌ తవ్వుతోన్న ప్రాంతంలో భూగర్భంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అధ్యయనం చేయడానికి కనీసం బోర్‌ హోల్స్‌ తవ్వే అవకాశం కూడా లేదని వెల్లడించారు. టన్నెల్‌ తవ్వే అత్యధిక ప్రాంతానికి చేరుకునే అవకాశమే లేదని.. ఈ నేపథ్‌యంలో ఎలాంటి జియో టెక్నికల్‌ పరీక్షలు లేకుండానే సొరంగం తవ్వకం పనులు ప్రారంభించారని పేర్కొన్నారు. శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ పవర్‌ స్టేషన్‌ పనులను చేపట్టిన అనుభవం, రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నిక్స్‌ సాయంతో భూ ఉపరితలంపై తీసిన ఫొటోల ఆధారంగానే టన్నెల్‌ తవ్వకం పనులు ప్రారంభించినట్టు ఈ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. టన్నెల్‌ పనులు నిలిపివేసిన నాలుగేళ్ల తర్వాత రెడ్‌ జోన్‌ (షియర్‌ జోన్‌)లో రాతి పొరల మధ్య ఎలాంటి మార్పులు ఉండబోవని.. ఇంకా నీటి ఊట పెరిగే ప్రమాదమే ఎక్కువగా ఉందని సీనియర్‌ జియోలజిస్ట్‌ తమతో వెల్లడించినట్టు ''ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'' తన కథనంలో వెల్లడించింది.

టన్నెల్‌ ఇన్‌లైట్‌ 13.85 కి.మీ.ల వద్ద షియర్‌ జోన్‌ కారణంగానే పనులు నెమ్మదించాయి. నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ తో పనులు వేగంగా చేయించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండుసార్లు రూ.వంద కోట్ల చొప్పున రూ.200 కోట్లు అడ్వాన్స్‌ గా ఇప్పించినా పనులు ముందుకు సాగలేదు. ఇన్‌లెట్‌ వైపు ప్రమాదకర పరిస్థితులు నెలకొనడంతో సొరంగం తవ్వకం పనులు నిలిపి వేసినా ఔట్‌ లెట్‌ వైపు నుంచి టన్నెల్‌ తవ్వకాన్ని కొనసాగించారు. ఇన్‌లెట్‌ వైపు నుంచి వచ్చే సీపేజీ (నీటి ఊట)ను ఎత్తిపోసేందుకు నెలకు రూ.2 కోట్ల కరెంట్‌ బిల్లు చెల్లించేందుకు కేసీఆర్‌ కేబినెట్‌లో తీర్మానం చేయించారు. రూ.24 కోట్ల కరెంట్‌ బిల్లులు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చెల్లించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కరెంట్‌ బిల్లులు చెల్లించలేదు. సీఎం రేవంత్‌ రెడ్డి, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, నల్గొండ జిల్లాకే చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వేగంగా టన్నెల్‌ తవ్వాలని జేపీ అసోసియేట్స్‌ తో పాటు టీబీఎం నిర్వహణ సంస్థ రాబిన్‌ సన్స్‌ పై ఒత్తిడి పెంచారు. షియర్‌ జోన్‌ లో టన్నెల్‌ పైకప్పు నుంచి మట్టి కూలుతుందని.. లోపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పినా పెడచెవిన పెట్టారు. టన్నెల్‌ తవ్వాల్సిందేనని కాంట్రాక్టర్‌ మెడపై కత్తి పెట్టినంత పని చేశారు. దీంతో టన్నెల్‌ ప్రాజెక్టు భవితవ్యాన్నే ప్రమాదంలోకి నెట్టేశారు.

Tags:    
Advertisement

Similar News