అక్కడ నేతలే కాదు.. ఇక్కడ ముఖ్యమంత్రే బీజేపీ బీ టీమ్ అట!
రాహుల్ జీ.. తెలంగాణలో కూడా గుజరాత్ సీనే;
గుజరాత్ లో కాంగ్రెస్ నేతలపై రాహుల్ నేతలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే నేతలు కాదు తెలంగాణలో ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రే బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీపాదాస్ మున్షీ స్థానంలో రాహుల్‌గాంధీకి సన్నిహితంగా ఉండే మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షీ నటరాజన్‌ను రాష్ట్ర వ్యవవహారాల ఇన్‌ఛార్జిగా నియమించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమేమీ కాదట. పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు తెలంగాణలో ఏం జరుగుతున్నదనే ఆరు నెలల ముందు నుంచే ఆమె స్టడీ చేసిందట. ఎప్పటికప్పుడు హైకమాండ్‌కు సమాచారాన్ని చేరవేసిందంట. అందుకే ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ఏం కావాలో చెప్పండి అని అడిగారు.
పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని ఒక గ్రూపులో, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని మరో గ్రూపుగా విభజించారనే వార్తలు వచ్చాయి. పార్టీ లైన్‌లో పనిచేసే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె అధిష్ఠానం మాటగా కుండబద్దలు కొట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు,, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతల భేటీలో మీనాక్షి సమక్షంలో నేను సీఎం అయినా నేను చెప్పింది ఏదీ నడుస్తలేదని రేవంత్ రెడ్డి వాపోయారు. ప్రోటోకాల్ సెల్ ఇన్ ఛార్జి పొద్దున రమ్మంటే సాయంత్రం వస్తున్నాడని, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి నేను ఢిల్లీకి వెళ్తే ఆయన హైదరాబాద్ వస్తున్నాడని, నేను హైదరాబాద్‌లో ఉంటే ఆయన ఢిల్లీకి వెళ్తున్నానడి అసహనం వ్యక్తం చేశాడు. అయితే వాళ్లు అలా వ్యవహరించడం వెనుక పార్టీ అధిష్ఠానం ఆదేశాలు ఉండి ఉంటాయంటున్నారు. అందుకే సీఎం రేవంత్‌కు ప్రధాని, కేంద్ర మంత్రులు ఎప్పుడు అడిగినా అపాయింట్ మెంట్ ఇస్తున్నారని, రాహుల్ మాత్రం ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడం లేదని వార్తలు వచ్చాయి. ప్రధాని, కేంద్ర మంత్రులన కలిసి ఫొటోలు బైటికి వచ్చాయి కానీ ఇటీవల రాహుల్‌తో రేవంత్ భేటీకి సంబంధించి ఇప్పటివరకు ఫొటో ఒక్కటి బైటికి రాకపోవడం గమనార్హం. బీజేపీ విధానాలపై, ఆ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా, అదానీ విషయంలో ఆపార్టీ అధిష్టానం దేశ వ్యాప్తంగా పోరాడుతున్నది. కానీ తెలంగాణలో మాత్రం తెలంగాణ సీఎం భిన్నంగా వ్యవహరించడాన్ని బహిరంగంగా తప్పుపట్టకున్నా కేసీ వేణుగోపాల్ ద్వారా మందలించినట్లు సమాచారం. తెలంగాణ మరో మధ్యప్రదేశ్, మరో మహారాష్ట్ర కాకూడదని అలర్ట్ అయింది.
మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ఫిరాయించడంతో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లో అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నిలబడితే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చేయడం గమనార్హం.తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శివరాత్రికి కోయంబత్తూర్‌లో సద్గురు జగ్గీవాసుదేవ్ ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు హాజరైన విషయం విదితమే. ఇది అటు జాతీయ కాంగ్రెస్, ఇటు కర్ణాటక కాంగ్రెస్‌లోనూ హీట్ పుట్టించింది. ఈ పరిణామాలపై బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత ఆర్ అశోకా స్పందిస్తూ.. డీకే శివకుమార్ మరో మహారాష్ట్ర ఏక్‌నాథ్ శిండే కానున్నారంటూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌లో కాక పుట్టించింది. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటునకు ఏక్‌నాథ్ షిండే సహకరించిన విషయాన్ని అశోకా ప్రస్తావించారు. అదే బాటలో డీకే శివకుమార్ కూడా నడిచి కాంగ్రెస్‌ను చీలుస్తారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని డీకే శివకుమార్ ఖండించారు· బీజేపీనేతలు ముందు తమ ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి.. · ఆ పార్టీ నేతలు మా పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారని కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి సహకరిస్తున్నారని. రాహుల్ గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసి బైటికి వెళ్లిన కొంతమంది కట్టర్ కాంగ్రెస్ నేతలు తెలంగాణ సీఎంపై అలాంటి విమర్శలే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ గుజరాత్‌లో అహ్మదాబాద్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రత్యామ్నాయంగా ఉండాలి, బీజేపీ 'బీ టీం' కాదు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో బీజేపీతో సంబంధం ఉన్న కాంగ్రెస్ నాయకులను ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లో కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీతో పనిచేసే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించడం గమనార్హం. అయితే రాహుల్ చెప్పిన వేటు గుజరాత్‌ను నేతలను మాత్రమే ఉద్దేశించి కాదని, బీజేపీకి బీ టీమ్‌గా పనిచేసే ఎవరినైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లేనని అంటున్నారు.