రేవంత్ విన్నపాలపై రాహుల్ రాడార్!
ఒంటరిగా ప్రధానిని రేవంత్ కలిసేందుకు రాహుల్ ససేమిరా.. గతంలో భట్టి.. ఇప్పుడు శ్రీధర్ బాబును వెంట పంపిన హైకమాండ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత నిఘా పెంచారా? రేవంత్ ప్రతి అడుగును రాహుల్ టీమ్ నిశితంగా గమనిస్తోందా? ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అధికారిక సమావేశాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోందా? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ ముఖ్యనేతల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనుమతించడం లేదు. రేవంత్ తో రాహుల్ కు సఖ్యత ఉన్న సమయంలోనే ప్రధానితో రేవంత్ ఒక్కరే భేటీ కావడానికి పార్టీ పెద్దలు ససేమిరా అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారిక పర్యటనకు బయల్దేరేందుకు సిద్ధమైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించి రేవంత్ వెంట ప్రధాని దగ్గరికి పంపించారు. ఇప్పుడు రేవంత్ తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ లీడర్లే చెప్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ కుటుంబానికి లాయల్ అయిన మంత్రి శ్రీధర్ బాబును సీఎం వెంట ప్రధాని దగ్గరికి పంపించారు. 15 నెలల్లో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మూడు పర్యాయాలు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైతే రెండు పర్యాయాలు భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉండగా, ఈసారి శ్రీధర్ బాబు వెంట ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీనియర్ నేతల అభ్యంతరాలను పక్కన పెట్టి రాహుల్ గాంధీ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. కొందరు సీనియర్ లీడర్లు సోనియాగాంధీని కలిసి ఫిర్యాదు చేసినా ఆమె సైతం రాహుల్ నిర్ణయమే ఫైనల్ అని తేల్చేశారు. సీఎం అయిన మొదట్లో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ కు కొంతవరకు రేవంత్ రెడ్డి నమ్మకస్తుడిలాగానే కనిపించారు. ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే సీఎం కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు రావడం, హైడ్రా పేరుతో సొంత ఎజెండాను ప్రమోట్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల తరబడి ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలను టార్గెట్ చేసి వారి ఇండ్లనే ఎక్కువగా కూల్చేయడంతో రాహుల్ గాంధీ క్రమేణ రేవంత్ ను పక్కన పెట్టడం మొదలు పెట్టారు. అసెంబ్లీలో పార్టీకి ఉన్న సంఖ్యాబలం, ఇతర కారణాలతోనే ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా రేవంత్ ను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ పాలన సాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాను భారత్ జోడో యాత్రలో హామీ ఇచ్చిన కుల గణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టినా రేవంత్ తీరుతోనే దాని విశ్వసనీయత దెబ్బతిన్నది. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణనను దేశం ఆదర్శంగా తీసుకోవాలని తాను తొందరపడి పార్లమెంట్‌లో మాట్లాడానా అని రాహుల్ మదన పడాల్సి వచ్చింది.
కుల గణనతో పాటు ఎస్సీ వర్గీకరణ విషయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని ఒకానొక దశలో కాంగ్రెస్ హైకమాండ్ అల్టిమేటం ఇవ్వాల్సి వచ్చింది. అయినా రేవంత్ ప్రభుత్వంపై రోజు రోజుకు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని సొంత టీమ్ ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి రిపోర్ట్ చేస్తోంది. ఈక్రమంలోనే రేవంత్ రెడ్డి వల్ల మరింత డ్యామేజ్ జరకుండా రాహుల్ టీమ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అధికారిక పర్యటనల పేరుతో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీల సందర్భంగా సొంత రాజకీయ నిర్ణయాలు తీసుకోవచ్చనే అనుమానంతో కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తులను రేవంత్ వెంట పంపుతోంది. ఇప్పటికే ఈ టాస్క్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా, ఇప్పుడు శ్రీధర్ బాబును రంగంలోకి దించింది. కేవలం ఢిల్లీలో రేవంత్ రెడ్డి కదలికలను మాత్రమే కాదు.. విదేశీ వేదికల్లో రేవంత్ రెడ్డి కదలికలను కూడా రాహుల్ టీమ్ క్లోజ్ గా వాచ్ చేస్తోంది. రేవంత్ రెడ్డికి రాజకీయ గురువుగా చెప్పే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నారు.. పలుమార్లు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీకి ఎందుకు వచ్చారు.. ఢిల్లీలో ఎవరిని కలిశారు.. గౌతమ్ అదానీతో రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది? లాంటి అంశాలపై సమాచారం సేకరించారు. ఆయా నివేదికల ఆధారంగా రేవంత్ రెడ్డిపై రాహుల్ టీమ్ మరింత నిఘా పెంచింది. ఈక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న దీపాదాస్ మున్షీపై వేటు వేసి రాహుల్ కోర్ టీమ్ మెంబర్ మీనాక్షి నటరాజన్ ను తెలంగాణ ఇన్‌చార్జీగా పంపింది. రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిస్థితి ఎదురైనా పార్టీకి నష్టం వాటిల్లకుండా రాహుల్ టీమ్ చర్యలు చేపట్టింది.